వైభవంగా పాతగుట్ట అధ్యయనోత్సవాలు

వైభవంగా పాతగుట్ట అధ్యయనోత్సవాలు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పూర్వగిరి(పాతగుట్ట) నరసింహస్వామి క్షేత్రంలో జరుగుతున్న అధ్యయనోత్సవాలు మంగళవారం రెండో రోజుకు చేరాయి. ఇందులో భాగంగా ఉదయం ఆలయంలో తిరుమంజనం, దివ్యప్రబంధ సేవాకాలం మహోత్సవాలను ఆలయ ఉప ప్రధానార్చకులు మాధవాచార్యుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. అనంతరం పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం  మూలవిరాట్లకు తిరుమంజనం వేడుకను వేద మంత్రోచ్ఛారణల మధ్య పూర్తిచేశారు.  

సాయంత్రం స్వామివారి నిత్యారాధనల తర్వాత దివ్యప్రబంధ సేవాకాలం ఉత్సవాన్ని జరిపించారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేక పూలతో అలంకరించారు. అనంతరం లక్ష్మీసమేత నారసింహుడిని ఆలయ తిరువీధుల్లో ‘పురప్పాట్టు సేవ’ నిర్వహించారు.  బుధవారం  స్వామివారి మూలవిరాట్లకు తిరుమంజనం, పరమపద ఉత్సవం నిర్వహించనున్నారు. ఈనెల 6న నిర్వహించే నూత్తందాది శాత్తుమొరై పూజలతో అధ్యయనోత్సవాలు పరిసమాప్తి కానున్నాయి.