- మత్స్యావతారంలో స్వామివారు
యాదగిరిగుట్ట,వెలుగు:యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అధ్యయనోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం అయ్యాయి. సాయంత్రం ప్రధానాలయంలో పారాయణీకులచే ద్రవిడ ప్రబంధ సేవాకాలంలో నిర్వహించి, తొళక్కం ప్రత్యేక పూజలతో అధ్యయనోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారికి మత్స్యావతార అలంకార సేవ నిర్వహించారు.
స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించిన అనంతరం ఆలయ మాఢవీధుల్లో ఊరేగించారు. అనంతరం ప్రధానాలయ ముఖ మంటపంలో అధిష్ఠింపజేసి మత్స్యావతార విశిష్టతను ఆలయ ప్రధానార్చకులు నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు వివరించారు. శుక్రవారం మొదలైన అధ్యయనోత్సవాలు ఈ నెల 15 వరకు జరగనున్నాయి.
నేడు వేణుగోపాలస్వామి, గోవర్ధనగిరిధారి అలంకార సేవలు
అధ్యయనోత్సవాల్లో భాగంగా నారసింహుడికి శనివారం ఉదయం వేణుగోపాలస్వామి అలంకార సేవ నిర్వహించనున్నారు. సాయంత్రం గోవర్ధనగిరిధారిగా అలంకరించి ఆలయ మాఢవీధుల్లో ఊరేగించనున్నారు.