ఆదిసంస్కృతి ఆద్యకళను ఆదరించాలె

వస్తు సేకరణలో ఒక వ్యక్తికి ఉన్న ఆసక్తి, ఆకాంక్ష, తపన కలగలిసి చివరకు ఓ మ్యూజియంగా రూపుదిద్దుకుంటాయి. హైదరాబాద్ లోని సాలార్ జంగ్ మ్యూజియం, బెంగళూరులోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ ఒకరు లేదా పలువురి వస్తు సేకరణ ఫలితంగా ఏర్పడ్డ  ప్రదర్శన కేంద్రాలే. ప్రొఫెసర్​జయధీర్ తిరుమలరావు శ్రామిక కులాల సాంస్కృతిక సంపద కాలగర్భంలో కలిసిపోకుండా 40 ఏండ్లుగా వస్తు సేకరణ, సంరక్షణ చేస్తున్నారు. శ్రామిక వర్గం, దళిత బహుజన కళలు, కళారూపాలు, కళాకృతులు శిష్ట సంప్రదాయాల కాళ్ల కింద నలిగిపోకుండా నడుం బిగించారు. ఆ సంపదనంతా ఒక చోటకు చేర్చి ప్రస్తుతం స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో కొనసాగుతున్న ‘ఆద్యకళ’తో వాటి వైభవాన్ని చాటి చెబుతున్నారు. తమ జాతికి ప్రతీకలైన ఈ కళారూపాలను శ్రామిక, బహుజన వర్గంతోపాటు సాధారణ ప్రజలు ఆదరించాలి. తెలంగాణ ప్రభుత్వం స్పందించి ‘ఆద్యకళ’ సంపద కోసం ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేసి ఆది సంస్కృతిని పరిరక్షించాలి.

వస్తు సేకరణ ఒకచోట కూర్చుంటే అయ్యేది కాదు. గ్రామీణ, సాంప్రదాయిక కళా సామగ్రిని కనుగొని సేకరించడం కష్టమైన పని. గ్రామాలకు వెళ్లాలి, డొంక దారుల్లో నడక సాగించాలి. ఆయా వస్తువుల సొంతదారులతో మమేకమవ్వాలి, వస్తువులను అప్పగించేందుకు వాటి భద్రతకు వారిలో విశ్వాసం కలిగేలా నమ్మకమియ్యాలి. సేకరించిన వాటిని ప్రస్తుత వాతావరణానికి చెడిపోకుండా, దెబ్బతినకుండా  భద్రపరచగలగాలి. ఎలా కాపాడాలో శాస్త్రీయంగా తెలిసి ఉండాలి. ఈ సేకరణకు, సంరక్షణకు మూలకర్త ప్రొఫెసర్​ జయధీర్ తిరుమలరావు. ఏడుపదుల వయసు దాటినా ఆయన నిత్య సంచారి. ఫలానా చోట ఓ పాతకాలపు కళాకృతి ఉందంటే ఉన్నపళంగా ప్రయాణం మొదలు పెట్టే వ్యక్తి. సమయాన్ని, శ్రమను, ఖర్చును లెక్కించకుండా చేతికందిన పురాతన సంపదతో పరవశించిపోయారు.  శ్రామిక కులాల సాంస్కృతిక సంపద కాలగర్భంలో కలిసిపోకూడదనేదే ఆయన సేకరణ వెనకనున్న అసలు ఉద్దేశం. శిష్ట సంప్రదాయాల కాళ్లకింద దళిత బహుజన కళలు, కళారూపాలు, కళాకృతులు నలిగిపోకూడదనే లక్ష్యం ఆయనను కార్యోన్ముఖుణ్ణి చేసి ఆదరణకు, ప్రదర్శనకు, ప్రచారానికి దూరంగా వెలివేతకు గురైన కళా సంపదను ఒక చోటకు చేర్చి వాటి వైభవాన్ని చాటేలా చేసింది. ఉత్పత్తి కులాలు తమ పనిముట్లను తామే తయారు చేసుకున్నట్లు తమ కళా ప్రదర్శనకు సరిపడే వాద్యాలు, ఆహార్యం, నాట్యం తామే సృష్టించుకున్నాయి. ఆధిపత్య కులాల వినోద విలాసాలతో స్థానం దొరకక తమ సామూహిక వినోదానికి కళారూపాలను రూపొందించుకొని, సాధన ప్రదర్శన దాకా తీసుకెళ్లాయి. విశ్వకర్మలు వెయ్యేళ్ల క్రితమే రుంజను మోగించినట్లు చరిత్ర చెబుతోంది. నాయకపోడు ఆదివాసీలు మూగడోలు, బైండ్లవారి జమిడిక, రాజన్నలు వాయించే చామల్లాలి, దడ దడలాడే డప్పు, సిద్దిల మార్ఫా, కోయల డోలు, చెంచుల జేగంటలు, గుత్తికోయల గుజ్జడి మొగ్గలు  అన్నీ ఆనాటి వైభవ సంస్కృతులే. మారిన కాలంతో పాటు బ్రాహ్మణీయ ఆధిపత్య కళల మూలంగా ఆ సాంస్కృతిక వైభవం వారి వాడలు దాటలేదు. వాద్యాలకు ఆదరణ లేక, కళారూపాల కొనసాగింపులేక గుడిసెల్లోనే  మూలుగుతున్నాయి. 

సంరక్షణ అందరి బాధ్యత
కళాకృతుల ప్రదర్శన, వాటి సందర్శన ఆయా నేలపై మనుషులకు సాంస్కృతిక, వారసత్వ సంపదపైనున్న ఆదరణను, మమకారాల్ని తెలుపుతాయి. కన్నడ రాజధానిలో ఒక గృహ సముదాయ విల్లావాసులు ఖాళీ ప్రాంతంలో బిల్డర్స్ తోడ్పాటుతో తలపెట్టిన నిర్మాణం ఇండియన్ మ్యూజిక్ ఎక్స్ పీరియన్స్ గా ప్రసిద్ధిగాంచింది. బెంగళూరుతో పోలిస్తే వైవిధ్యభరిత ప్రదర్శనశాలలు మన దగ్గర సగమైనా లేవు. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి పెడితే ఒక ప్రదర్శనశాలకు సరిపడా కళాసంపద సిద్ధంగా ఉందని ప్రస్తుతం స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో కొనసాగుతున్న ‘ఆద్యకళ’ ప్రదర్శనను రుజువుగా చూపించవచ్చు. వీలైతే ప్రస్తుతం ప్రదర్శితమవుతున్న కేంద్రంలోనే శాశ్వత మ్యూజియంను ఏర్పాటు చేయవచ్చు కూడా. ఈ ప్రదర్శనను చూసిన వారెవరికైనా ఇది 15 రోజుల పండుగలా కాకుండా ఒక మ్యూజియంగా ఎల్లవేళలా అందుబాటులో ఉండాలనిపిస్తుంది. సందర్శకులను కట్టి పడేసే పూర్వపు సంగీత వాద్యాలు, లోహ శిల్పాలు, తాళపత్రాలు ఇలా చరిత్రను, మానవ పరిణామాన్ని చెప్పే సకల కళాకృతులు ఇక్కడ ఉన్నాయి. ఈ విలువైన సామగ్రిని ప్రదర్శనయోగ్యంగా, ప్రామాణిక భద్రతతో కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. జనాభాలో అధికులైన శ్రామికవర్గం తమ జాతికి ప్రతీకలైన కళారూపాలను ఆదరించకపోతే, కళ్లు తెరవకపొతే తమ గత వైభవ ఆనవాళ్లను కోల్పోతారు. తెలంగాణ ప్రభుత్వం కూడా కళా సంపద సంరక్షణకు పూనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

ఆద్యకళ ప్రదర్శన ప్రత్యేకతలెన్నో..
ఆద్యకళ ప్రదర్శనలో నాలుగు విభాగాలున్నాయి. ఆది ధ్వని, ఆది చిత్రం, ఆది అక్షరం, లోహ కళగా ఆది సంపదను విభజించి అమర్చారు. ఆదిధ్వనిలో 350కి పైగా రకరకాల ఆదివాసీ, జానపద సంగీత వాద్యాల ప్రదర్శన ఉంది. ఆదిచిత్రంలో వివిధ ఆకారాల వస్త్రాలపై పండుగలు, సాంప్రదాయ ఆచరణకు చెందిన ప్రాకృతిక రంగులతో వేసిన చిత్రాలు, నకాషి బొమ్మలు చూడొచ్చు. ఇందులో 300 ఏళ్లనాటివి కూడా ఉన్నాయి. ఆది అక్షరంలో  తాళపత్రాలతో పాటు అక్షరాలు చెక్కిన తోలు పట్టాలు వింతగొల్పుతాయి. 500కు పైగా ఉన్న ఈ అక్షరావళిలో 15 నుంచి 20 మీటర్ల పొడవున్న ముతక కాగితపు చుట్టాల్లో చరిత్ర దాగి ఉంది. యాదవులకు చెందిన కాటమరాజు చరిత్ర వీటిలో ఒకటి. వివిధ లోహాలు, మిశ్రమధాతువులతో రూపొందించిన చిన్న, పెద్ద విగ్రహాలు నాటి హస్తకళల నైపుణ్యాన్ని చాటి చెబుతాయి.  కళారూపాలు మనిషి సౌందర్యారాధనకు సూచికలు. పురాతన వస్తువులు గత కాలాన్ని ముందుంచే దీపకాంతులు. ఆదరించే మనసుంటే మనమంతా ఒక్కటే అనే,  కళాకృతులకు అందరం వారసులమే అనే జ్ఞానబోధ చేస్తాయి. ఈ ప్రదర్శనలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో మూలమూలన తిరిగి తిరుమలరావు 40 ఏళ్ల పాటు సేకరించిన సంగీత వాద్యాలు, తాళపత్రాలు, పటాలు, దస్తావేజులు, తోలు ఎముకలతో రూపొందించిన వస్తువులు, వస్త్రాలు ఉన్నాయి. హైదరాబాద్ లోని మాదాపూర్ లో చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ‘ఆద్యకళ’ ప్రదర్శన జులై31న ప్రారంభమైంది. ఆగస్టు15 వరకు కొనసాగనుంది. 

- బి.నర్సన్, సోషల్​ ఎనలిస్ట్​