రాష్ట్రంలో అల్లర్లకు బీఆర్​ఎస్ కుట్ర.. 100 కోట్ల ఖర్చుతో విధ్వంసానికి స్కెచ్: విప్ ఆది శ్రీనివాస్

రాష్ట్రంలో అల్లర్లకు బీఆర్​ఎస్ కుట్ర.. 100 కోట్ల ఖర్చుతో విధ్వంసానికి స్కెచ్: విప్ ఆది శ్రీనివాస్

హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ ను అరెస్టు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లను సృష్టించేందుకు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేందుకు ఒక్కో నియోజకవర్గానికి రూ. కోటి ఖర్చు చేసే కుట్రకు బీఆర్ఎస్ తెరలేపిందని  విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో మీడియాతో మాట్లాడారు.

కేటీఆర్ బినామీ తేలుకుంట్ల శ్రీధర్ ఇప్పటికే కేడర్ కు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారముందన్నారు. రూ.100 కోట్లు ఖర్చు చేసి ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులను తగలబెట్టి అల్లర్లు సృష్టించాలని, ధర్నాలు, నిరసనలకు దిగాలని నియోజకవర్గాలకు డబ్బును పంపించారని తెలిపారు. దీనిపై పోలీసులు నిఘా ఉంచాలని, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. బీఆర్ఎస్ ముసుగులో ఎవరైనా అల్లర్లు చేయాలని చూస్తే ఎక్కడికక్కడ అణిచివేయాలని పోలీసు అధికారులను కోరారు.

బీఆర్ఎస్ అగ్రవర్ణ నేతల ప్లాన్​: విప్ లక్ష్మణ్​

మరో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. కేటీఆర్ అరెస్టు సందర్భంగా రౌడీలతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ లోని అగ్ర వర్ణాలకు చెందిన నాయకులు ఈ కుట్రలకు ప్లాన్ చేశారని, తమకు అందిన సమాచారాన్ని డీజీపీ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు.

ఈ కుట్రలకు దగ్గరుండి ప్లాన్ చేస్తున్న శ్రీధర్ ను అరెస్టు చేయాలని కోరారు. గతంలో ఇదే సభలో స్పీకర్ పై పేపర్ విసిరినందుకు తమ నాయకులను సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ.. స్పీకర్ పై దాడి చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్, వివేకానంద గౌడ్, కౌశిక్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.