కేసీఆర్​ ఇంకా భ్రమల్లోనే ఉన్నరు.. ఆది శ్రీనివాస్

కేసీఆర్​ ఇంకా భ్రమల్లోనే ఉన్నరు.. ఆది శ్రీనివాస్

ఆయనపై విశ్వాసం లేకనే ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరిన్రు

హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్​ఇంకా ఊహలు, భ్రమల మధ్యనే ఉంటున్నారని.. ఆయన సైకాలజిస్ట్  కు చూపించుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం అసెంబ్లీలోని సీఎల్పీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తీరు చూస్తుంటే ఫామ్ హౌస్ కు ముఖ్యమంత్రిని అని చెప్పుకునేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఫామ్ హౌస్ లో కూర్చొని బీఆర్ఎస్ కార్యకర్తలకు పేదరాసి పెద్దమ్మ కథలు చెప్తున్నారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కేసీఆర్  ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని విమర్శించారు.

కేసీఆర్ పై విశ్వాసం లేకనే ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ లు కాంగ్రెస్ లో చేరారన్నారు. రానున్న రోజుల్లో  కేసీఆర్ వెంట ఎవరూ ఉండరన్నారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులు మొదలు పెట్టిందే కేసీఆర్​అని దుయ్యబట్టారు. ప్రగతి భవన్ నుంచే కేసీఆర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడినప్పుడు కేటీఆర్ గడ్డి పీకారా అని ఆయన ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ కుటుంబానిది త్యాగాల చరిత్ర అయితే.. కేటీఆర్  కుటుంబానిది బోగాల చరిత్ర అని ధ్వజమెత్తారు.

రైతులకు ఏం చేయాలో  సీఎం రేవంత్ రెడ్డికి తెలుసని, తెలంగాణ రైతును రాజును చేస్తామన్నారు. రైతు రుణమాఫీ చేస్తామని, దున్నేవాడికే రైతుభరోసా ఇస్తామని ఆయన పేర్కొన్నారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వబోతున్నామన్నారు. సవాల్ విసిరిన హరీశ్ రావు రాజీనామా పత్రం సిద్ధం చేసుకోవాలని సూచించారు. దేశ రైతులు కేసీఆర్ కోసం ఎదురు చూస్తుంటే, ప్రధాని కావాలనుకున్న కేసీఆర్ దేశవ్యాప్తంగా ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు.

కేసీఆర్ ను ఓడించిందే తెలంగాణ రైతులన్న విషయాన్ని గుర్తించాలన్నారు. రైతులకు మంచి చేస్తే  కేసీఆర్ ని  ఎందుకు ఓడిస్తారన్నారు. తెలంగాణ ప్రజలతో పేగు బంధం ఆ పార్టీ పేరు మార్పుతోనే పోయిందన్నారు. ఈ ఐదేండ్లు, రాబోయే మరో ఐదేండ్లు కూడా కాంగ్రెస్​ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు.