మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ ధ్యేయం : ఆది శ్రీనివాస్

మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ ధ్యేయం : ఆది శ్రీనివాస్
  •  ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

వేములవాడరూరల్, వెలుగు: కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి, వట్టెంల, ఫాజుల్​నగర్  గ్రామాల్లో ఇందిరా మహిళా శక్తి కింద ఐకేపీ ఆధ్వర్యంలో ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇస్తూ కొనుగోలు చేస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో 50 శాతం కొనుగోలు కేంద్రాలను వారికి కేటాయించారని వెల్లడించారు. సన్న వడ్లు పండించే రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం క్వింటాల్ కు అదనంగా రూ. 500 ఇస్తున్నదని తెలిపారు.

రైతులు పండించిన చివరి గింజ వరకు కొంటామని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో 600 కోట్లు బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలు మంజూరు చేశామన్నారు. మొదటి విడతలో మహిళా సంఘాలకు  రూ.30 లక్షలతో బస్సు మంజూరు చేశామన్నారు. మహిళలు ముందుకు వస్తే రైస్ మిల్లు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామన్నారు. రాజీవ్ యువ వికాసం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్​ రాజు, మండల అధ్యక్షుడు శ్రీనివాస్​, పర్శరాములు, రాములు, ఏపీఎం చంద్రయ్య పాల్గొన్నారు. 

క్రీడలతో మానసికోల్లాసం 

కోరుట్ల : క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం లభిస్తుందని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. కథలాపూర్ మండల కేంద్రంలో కథలాపూర్ మండల ప్రీమియం లీగ్ క్రికెట్ పోటీల బహుమతి ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం బొమ్మెన గ్రామంలో రూ.20 లక్షల ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు పెద్ద పీట వేస్తున్నారని, నాణ్యమైన విద్యుత్, ఎరువులు, మేలైన వంగడాలను అందిస్తున్నామని తెలిపారు. పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.