వేములవాడ, వెలుగు: రైతును రాజును చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న ఆలయ గుడి చెరువు కింద ఉన్న ఆయకట్టు రెండో పంటకు మంగళవారం సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడి చెరువు ద్వారా 150 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు అమరేందర్ రెడ్డి, ప్రశాంత్ కుమార్, కాంగ్రెస్పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శి రాకేశ్, రాంబాబు, తోట రాజు, కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.
బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తా
కథలాపూర్: తక్కలపల్లి-–సిరికొండ గ్రామాల మధ్యనున్న బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరలోనే పూర్తిచేస్తామని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం కథలాపూర్ మండలంలోని సిరికొండ,తక్కలపల్లి గ్రామాల్లో కృతజ్ఞత సభ ర్యాలీలో ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన ప్రజలకు , కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
మీ ఇంటి బిడ్డగా సేవలందిస్తా
కోనరావుపేట: తాను మీ ఇంటి బిడ్డగా సేవలందిస్తాననివేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కోనరావుపేట మండలం నిజామాబాద్, కనగర్తి, సుద్దాల గ్రామాల్లో కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిజామాబాద్ గ్రామంలో కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ సోదరుని కుమారుడు సుశాంత్ సోమవారం గుండె పోటుతో చనిపోగా, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. లీడర్లు జగన్మోహన్రెడ్డి, ఫిరోజ్‌షా, అరుణ పాల్గొన్నారు.