కలగానే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్! అన్ని వసతులు ఉన్నా పట్టించుకోలే.. జిల్లాలో భారీ ప్రాజెక్టులకు కలగని మోక్షం

కలగానే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్! అన్ని వసతులు ఉన్నా పట్టించుకోలే..  జిల్లాలో భారీ ప్రాజెక్టులకు కలగని మోక్షం
  • కలగానే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్!
  • తాజాగా వరంగల్​కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
  • ఆదిలాబాద్,కు మాత్రం మొండిచేయి 
  • అన్ని వసతులు ఉన్నా పట్టించుకోలే  
  • జిల్లాలో భారీ ప్రాజెక్టులకు కలగని మోక్షం

ఆదిలాబాద్, వెలుగు :  ఆదిలాబాద్ లో విమానం ఎగరవచ్చని ఎన్నో ఏండ్లు గా జిల్లావాసులు ఎదురుచూస్తుండగా నిరాశే మిగిలింది. అప్పుడు.. ఇప్పుడంటూ ఊరిస్తూ వచ్చిన కేంద్రం జిల్లాకు మరోసారి మొండిచేయి చూపింది. వరంగల్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఆదిలాబాద్ లో ఏర్పాటుపై ఊసెత్తలేదు. దీంతో జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు విఫలమయ్యారని ప్రజలు మండిపడుతున్నారు. 

దశాబ్దాలుగా ఎయిర్ పోర్టు నిర్మిస్తారని చెబుతుండగా.. పలుమార్లు సర్వేలు చేసినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపంతోనే ఆదిలాబాద్ కు ఎయిర్ పోర్ట్ రావడంలేదనే విమర్శ వినిపిస్తోంది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఎయిర్ పోర్ట్ అంశాన్ని తెరపైకి తీసుకురావడం.. ఆ తర్వాత మరిచిపోవడం పరిపాటిగా మారింది. దేశ ఉత్తర, దక్షిణ రాష్ట్రాలను కలుపుతూ 44వ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఆదిలాబాద్ లో ఎయిర్ పోర్ట్ కు  అవసరమైన అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయి. కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యంతో అది కలగానే మిగిలిపోతుంది. 

ఎక్కడా లేని విధంగా అందుబాటులో స్థలం

ఆదిలాబాద్ లో ఎయిపోర్టుకు ఏర్పాటు కావాల్సిన స్థలం  అందుబాటులో ఉంది. గతేడాది కొత్తగూడెం, రామగుండంలో ఎయిర్ పోర్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం తాజాగా వరంగల్ లో నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చింది. కానీ ఆదిలాబాద్ లో ఏర్పాటుపై ఇంకా అడుగు ముందుకు పడటం లేదు. ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ గతేడాది ఆగస్టులో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసి వినతి పత్రం అందించారు. గతంలోనూ పలుమార్లు మాజీ ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఢిల్లీ పెద్దలను కలిసినా ఎలాంటి స్పందన లేదు.  

రక్షణ శాఖకు సంబంధించి 369 ఎకరాలు అందుబాటులో ఉంది. 2014లో వైమానిక శిక్షణ  కోసం కేంద్ర ప్రభుత్వం స్థల సేకరణ చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు దాదాపు 2 వేల ఎకరాలను అధికారులు గుర్తించారు. కేంద్రానికి నివేదిక కూడా పంపారు. అయితే అప్పటి బీఆర్ఎస్ సర్కార్  ఎన్వోసీ ఇవ్వకపోవడంతో ప్రక్రియ నిలిచిపోయిందనే ఆరోపణలు వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎయిర్ పోర్టు అంశంపై పలుమార్లు పలు రాజకీయ పార్టీల నేతలు ప్రచారం చేస్తున్నారే తప్ప అమలు దిశగా పర్మిషన్లు సాధించడంలేదు. 

ఎయిర్ పోర్టు నిర్మిస్తే అభివృద్ధికి అవకాశం

 జిల్లాలో భారీ ప్రాజెక్టులు ఎక్కడా కనిపించడం లేదు. సిమెంట్ ఫ్యాక్టరీ, రైల్వే లైన్, పత్తి ఆధారిత పరిశ్రమలు, వంటి భారీ ప్రాజెక్టులే లేదు. ఎయిర్ పోర్ట్ నిర్మాణంతోనైనా ఆదిలాబాద్ అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎయిర్ పోర్ట్ వస్తే.. వ్యాపారాలు, రవాణా సదుపాయాలు మెరుగపడే అవకాశాలు ఉంటాయి. 

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు 300 కిలోమీటర్లు, మహారాష్ట్రలోని ప్రధాన సిటీ నాగ్ పూర్ కు 200 కి.మీ దూరంలో ఉంది.  జిల్లా కేంద్రంలో ఎయిర్ పోర్టు నిర్మిస్తే అన్ని విధాలుగా అభివృద్ధి చెందే చాన్స్ ఉంటుంది.  ఇందుకు అనువైన పరిస్థితులు కూడా ఉన్నాయి.  గతంలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడితో కలిసి జిల్లాలో ఎయిర్ పోర్టు నిర్మాణంపై ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కానీ తాజాగా ప్రకటించిన లిస్టులో ఆదిలాబాద్ ను చేర్చలేదు.