నిర్మల్ లో ఉత్తమ టీచర్లకు సన్మానం
నిర్మల్ : మెరుగైన సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర వెలకట్టలేనిదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. సోమవారం స్థానిక అంబేద్కర్ భవన్లో నిర్వహించిన జాతీయ ఉపాధ్యాయ దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం విద్యరంగ అభివృద్ధికి చేస్తున్న కృషిలో టీచర్లంతా స్వచ్ఛందంగా భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. ఉపాధ్యాయుడు లేని సమాజాన్ని ఊహించలేమన్నారు. ‘మన ఊరు... మన బడి’, ఇంగ్లిష్ మీడియం లాంటి కార్యక్రమాలతో రాష్ట్రంలో విద్యారంగం ముందుకు దూసుకుపోతోందన్నారు. ప్రభుత్వం తెలంగాణ ట్యాగ్ లైన్ నిధులు, నీళ్లు, నియామకాల ఏజెండాను పూర్తిచేస్తోందన్నారు. పదోతరగతి పరీక్షల్లో నిర్మల్‌జిల్లా రాష్ట్రంలో రెండో స్థానం రావడం అందరికీ గర్వకారణమన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్‌అలీ ఫారూఖీ, అడిషనల్ కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, డీఈవో డాక్టర్రవీందర్రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ఎర్రవోతు రాజేందర్, ఏఎంసీ చైర్మన్ చిలుక రమణ, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల హక్కులు కాలరాస్తున్రు...
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులు కాలరాస్తూ కార్పొరేట్‌శక్తులకు అండగా నిలుస్తోందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. సోమవారం దిలావర్పూర్లో ఎల్ఐసీ ఉద్యోగులు నిర్వహించిన ఆందోళనకు ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. ఎల్ఐసీలో వాటాల అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ ప్రజలపై పన్నుల భారం మోపుతుందన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు.
పోన్కల్ మండలంపై కట్టుబడి ఉన్నాం...
పోన్కల్ మండలంగా ఏర్పాటు చేసేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి ఐకేరెడ్డి తెలిపారు. గ్రామస్తులు చేస్తున్న దీక్షకు మంత్రి సంఘీభావం తెలిపారు. మండలం ఏర్పాటు హామీ త్వరలో నెరవేరుతుందన్నారు. సమస్యను సీఎం కేసీఆర్దృష్టికి తీసుకెళ్తానన్నారు. మంత్రి వెంట టీఆర్ఎస్ నాయకులు రాంకిషన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
స్టడీ సెంటర్ నిర్వాహకుడి కోసం ఆరా
మందమర్రి : సింగరేణి జూనియర్ అసిస్టెంట్ఎగ్జామ్ పేపర్ లీక్ వ్యవహారం, ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షలు దండుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మంచిర్యాలకు చెందిన ఓ స్టడీ నిర్వాహకుడి వ్యవహారంపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. పరీక్షలకు మూడు రోజుల ముందు స్టడీ సెంటర్ నిర్వాహకుడు 20 మంది అభ్యర్థులను గోవాకు తీసుకెళ్లి ఎగ్జామ్‌లోని ప్రశ్నలపై ప్రాక్టీస్ చేయించాడని, ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి రూ.20 లక్షలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్టడీ సెంటర్ నిర్వాహకుడి కోసం ఇప్పటికే ఇంటిలిజెన్స్ పోలీసులు ఆరా తీసినట్లు కూడా తెలిసింది. సింగరేణిలో ఉద్యోగాలు పెట్టిస్తానని రూ.లక్షలు వసూలు చేసి ఉద్యోగం కోల్పోయిన ఆపీసర్‌కు మధ్య సంబంధాలపై ఆరా తీస్తున్నారు. శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే న్యూటెక్ ఉద్యోగి పాత్రపై కూడా విచారణ చేస్తున్నట్లు తెలిసింది.
డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ కమిటీ నియామకం
మందమర్రి : మందమర్రి ఏరియా సింగరేణి వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్. వరప్రసాద్‌రావు సోమవారం తెలిపారు. 2022–-23 సంవత్సరానికి గాను డబ్ల్యూపీఎస్ అండ్జీఏ ప్రెసిడెంట్‌గా ఏరియా సింగరేణి జీఎం చింతల శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్‌గా ఎస్వోటు జీఎం సీహెచ్కృష్ణారావు, చీఫ్ కో ఆర్డినేటర్‌గా పర్సనల్ మేనేజర్ వరప్రసాద్‌రావు, హానరేబుల్ సెక్రటరీగా సీనియర్ పీవో ఎండీ ఆసిఫ్, జాయింట్ ఆర్గనైజర్‌గా రీజియన్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ సీహెచ్ అశోక్, ఏరియా కో ఆర్డినేటర్‌గా తోట చిన్నయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయా క్రీడలకు కెప్టెన్లును ఎంపిక చేశారు. ఓం నారాయణ(జనరల్), బి.శివకుమార్(ఫుట్‌బాల్), పి.యోగేశ్(వాలీబాల్), డి.నాగరాజు(బాస్కెట్‌బాల్), ముద్దసాని కృష్ణ(హాకీ), జి.భిక్షపతి(కబడ్డీ), బి.వెంకటస్వామి(బాడీబిల్డింగ్, పవర్, వెయింట్ లిప్టింగ్), ముదం కిషన్(టెన్నిస్), జి.శ్రీనివాస్(క్రికెట్), ఎ.రవికుమార్(అథ్లేటిక్స్), జి.రాజారమేశ్బాబు(షటిల్బాడ్మింటన్), టి.శ్రీనివాస్రావు(చెస్), ఎండీ.మోసిన్‌అలీ(క్యారమ్స్), పి.వెంకటేశ్వర్లు (టేబుల్ టెన్నిస్), డి.సుదర్శన్(కల్చరల్), విమలాకుమారి(విమెన్ విభాగం)ను ఎంపికచేశారు.
బీజేపీ జాయింట్ కన్వీనర్ నియామకం...
చెన్నూర్ : బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం జాయింట్ కన్వీనర్‌గా సీనియర్ నాయకుడు చెన్నూర్‌కు చెందిన నగునూరి వెంకటేశ్వర్లుగౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ ఉత్వర్తులు జారీ చేశారు. తనను ఈ పదవిలో నియమించిన బండి సంజయ్‌కు, ఇందుకు సహకరించిన జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి, జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌రావు, జిల్లా ఇన్చార్జి పల్లె గంగారెడ్డి, గోనె శ్యాంసుందర్రావులకు కృతజ్ఞతలు తెలిపారు. వెంకటేశ్వర్లు గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, తూర్పు జిల్లా బీజేవైఎం అధ్యక్షుడిగా పార్టీకి సేవలందించారు. ప్రస్తుతం పార్లమెంట్ కో కన్వీనగర్‌గా పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
ప్రజల చూపు బీజేపీ వైపు...
దండేపల్లి, వెలుగు: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వెర్రబెల్లి రఘునాథ్‌రావు చెప్పారు. సోమవారం లక్సెట్టిపేటలోని ఉత్కూర్ చౌరస్తాలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టాలన్నారు. పట్టణ అధ్యక్షుడు వీరమళ్ల హరిగోపాల్‌రావు, ఉపాధ్యక్షులు చాతరాజు శివశంకర్, నాయకులు పైడిపాల రమేష్, మోటపలుకుల సతీష్, గడమళ్ల చంద్రయ్య, లకావత్ రవీందర్, ఎగ్గడి నాగరాజు, వేముల మధు, ముస్కమ్ గంగన్న పాల్గొన్నారు.
పార్టీ అభివృద్ధికి కృషి చేస్తా
నిర్మల్ : బీజేపీ ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆ పార్టీ పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్నగారి భూమయ్య తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీస్‌లో భూమయ్యను లీడర్లు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ పెద్దపల్లి ఇన్చార్జి రావుల రాంనాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు మెడిసెమ్మ రాజు, సామ రాజేశ్వర్‌రెడ్డి, డాక్టర్మల్లికార్జున్ రెడ్డి, లీడర్లు కమల్ నయన్, అర్వింద్, భాస్కర్, శ్రీనివాస్, భూపతిరెడ్డి, శ్రవణ్, వెంకటేశ్తదితరులు పాల్గొన్నారు.
మోఖాపై మేముంటే.. వేరేటోళ్లకు పట్టాలు ఇచ్చిన్రు
⇒గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు కంప్లైంట్ చేసిన రైతులు
⇒డబుల్ బెడ్ డ్రూం రాలేదని మహిళ ఆవేదన
మంచిర్యాల : 'మా మండలంలో 2007–08 సంవత్సరంలో అసైన్మెంట్ పట్టాలు ఇచ్చిన్రు. అప్పుడు మోఖాపై ఉన్న పట్టాదారులను తొలగించి అధికారులు ఇతరులకు పట్టాలు ఇచ్చిన్రు. దీంతో అసలు పట్టాదారులమైన మాకు రైతుబంధు, క్రాప్లోన్లు రాక నష్టపోతున్నాం. దీనిపై ఎంక్వయిరీ జరిపించి మాకు న్యాయం చేయాలె' అని వేమనపల్లి మండలం దస్నాపూర్, కొత్తపల్లి గ్రామాలకు చెందిన పలువురు రైతులు సోమవారం గ్రీవెన్స్‌సెల్‌లో కంప్లైంట్ చేశారు. కలెక్టర్ భారతి హోళికేరిని కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. అలాగే దండేపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన కాసుగంటి సుమలత.. లింగయ్య అనే వ్యక్తి దగ్గర ఎకరం భూమి కొన్నామని, మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే రికార్డుల్లో లింగయ్యకు 25 గుంటలు మాత్రమే ఉన్నట్టు చూపుతోందని, ఇరిగేషన్ కోసం 2011లో 16 గంటలు తీసుకోగా, రెండోసారి కూడా తీసుకున్నట్టు రికార్డుల్లో ఉందని, విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరారు. జన్నారం మండలం మొర్రిగూడకు చెందిన బదావత్ జ్యోతి కల్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేసింది. కాసిపేట మండలం ట్యాంక్ బస్తీకి చెందిన దివ్యాంగురాలైన సాంబారి నవీనశ్రీ బీఎస్సీ నర్సింగ్ చదివిన తనకు బస్తీ దవాఖానలో ఉద్యోగం ఇప్పించాలని కోరింది. మంచిర్యాల రాంనగర్‌కు చెందిన బొమ్మిదేని లక్ష్మికి గతంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్టు ఆన్లైన్లో చూపుతున్నందున ప్రస్తుతం డబుల్ బెడ్రూంకు అర్హత లేదని అధికారులు పేర్కొన్నారు. కానీ తనకు గతంలో ఇందిరమ్మ ఇల్లు రాలేదని, నిరుపేద అయిన తనకు డుబల్ బెడ్రూం ఇప్పించాలని కలెక్టర్‌ను వేడుకుంది.
నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలి...
మంచిర్యాల : గణేశ్ నిమజ్జన ఉత్సవాలను ప్రశాంత వాతావరణలో జరుపుకోవడానికి అందరూ సహకరించాలని డీసీపీ అఖిల్ మహాజన్ సూచించారు. సోమవారం మంచిర్యాల పోలీస్ స్టేషన్ ఆవరణలో జిల్లాలోని గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, మత పెద్దలు, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. నిర్వాహకులు నిమజ్జనం తేదీని, నిమజ్జనానికి వెళ్లే ప్రదేశాన్ని, ఏమార్గం గుండా వెళ్లే వివరాలను సంబంధిత పోలీస్ స్టేషన్లో తెలియజేయాలన్నారు. శోభాయాత్రలో డీజేలకు పర్మిషన్ లేదన్నారు.సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, ఏ సమస్య ఉన్నా పోలీసులకు తెలియజేస్తే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. ఏసీపీలు తిరుపతిరెడ్డి, ఎడ్ల మహేష్, నరేందర్, సీఐలు నారాయణ, సంజీవ్, కరీముల్లాఖాన్, ప్రమోద్‌రావు, రాజు, బాబు రావు, జగదీష్, బి.రాజు, ప్రవీణ్‌కుమార్, విద్యాసాగర్, శ్రీనివాస్, నరేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పీఎల్ఆర్ బోనస్‌పై 28న మీటింగ్...
మందమర్రి : బొగ్గు గని కార్మికుల పీఎల్ఆర్ బోనస్నిర్ణయించేందుకు ఈనెల 28న రాంచీలో సమావేశం జరుగుతుందని బీఎంఎస్ నేషనల్ఇన్చార్జి, జేబీసీసీఐ మెంబర్ కొత్తకాలపు లక్ష్మారెడ్డి, సింగరేణి కోల్ మైన్స్కార్మిక సంఘ్ స్టేట్ప్రెసిడెంట్ యాదగిరి సత్తయ్య తెలిపారు. గత ఏడాది రూ.75వేల బోనస్ఇచ్చారని, ఈసారి మరింత మెరుగైన బోనస్ ఇప్పించేందుకు యూనియన్ కృషి చేస్తుందన్నారు.
పాలజ్ గణేశ్‌కు డీసీసీ ప్రెసిడెంట్ పూజలు
కుభీర్ : ప్రసిద్ధ పాలజ్ కర్ర వినాయకుడిని సోమవారం నిర్మల్డీసీసీ ప్రెసిడెంట్పవార్ రామారావు పటేల్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్‌ప్రభుత్వమేనన్నారు. ఆయన వెంట లీడర్లు బి.గంగాధర్, ఛక్రధర్ పటేల్, శంకర్, పబ్బు రాజేందర్ తదితరులు ఉన్నారు.
ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి...
ఆదిలాబాద్ టౌన్ : తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే జోగు రామన్న చెప్పారు. సోమవారం స్థానిక కేఆర్కే కాలనీలో నూతనంగా నిర్మించిన బస్తీ దవఖానాను ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వాలు పేద ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజలకు వైద్య సేవలను చేరువ చేసేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవఖానాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్ నరేందర్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ శైలజ, వైస్ చైర్మన్ జహీర్ రంజాని, పట్టణ అధ్యక్షుడు అజయ్, కౌన్సిలర్ అంజు బాయి తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే వామన్‌రెడ్డి సేవలు మరువలేనివి
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే వామన్ రెడ్డి సేవలు మరువలేనివని బీజేపీ రాష్ట్ర నాయకురాలు చిలుకూరి జ్యోతి రెడ్డి చెప్పారు. సోమవారం వామన్‌రెడ్డి జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేఆర్ కే కాలనీలోని వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు జ్యోతి, గంగుబాయి, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు
నర్సాపూర్(జి),వెలుగు: కుంటాల మండల కేంద్రానికి చెందిన భూమన్న(68)పై సోమవారం పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పోగుల సుమాంజలి తెలిపారు. నిందితుడు కుంటాల గ్రామానికి చెందిన మూడేళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
పుకార్లు నమ్మొద్దు : సీఐ ప్రవీణ్ కుమార్
భైంసా : గత రెండు, మూడ్రోజులుగా దొంగలు పిల్లలను ఎత్తుకెళ్తున్నారని వస్తున్న పుకార్లను ప్రజలు నమ్మవద్దని పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ సూచించారు. సోమవారం స్టేషన్ లో మీడియాతో మాట్లాడారు. గుజరాత్ కు చెందిన గ్ భైంసాలో తిరుగుతూ పిల్లలను ఎత్తుకెళ్తున్నారని సోషల్ మీడియాలో పుకార్లు షికారు కొడుతున్నాయని, ఇది అవాస్తవమన్నారు. ఖాజీ గల్లీలో ఓ బాలుడిని ఎత్తుకెళ్లారని వాట్సాప్ లో వచ్చిన వార్త తప్పుడు ప్రచారమని, అలాంటిది ఏమి లేదన్నారు. ప్రస్తుతం భైంసా పూర్తిగా పోలీసు వలయంలో ఉందని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పట్టణమంతా సీసీ కెమెరా నిఘాలో ఉందని వెల్లడించారు. అనుమానిత వ్యక్తులు సంచరిస్తే 100 లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
విధుల్లోకి తీసుకునేలా చూడండి
కాగజ్ నగర్,వెలుగు: ఎస్సీఎంలోని 260 మంది ఉద్యోగులను జేకే యాజమాన్యం తిరిగి విధుల్లోకి తీసుకునేలా చూడాలని మాజీ ఎంప్లాయీస్ , బీజేపీ లీడర్లు కోరారు. ఈమేరకు సోమవారం హైదరాబాద్‌లోని డిప్యూటీ సెంట్రల్ లేబర్ కమిషనర్ శ్రీనివాసులు కలిసి వినతి పత్రం అందజేశారు. స్పందించిన కమిషనర్ యాజమాన్య ప్రతినిధులను పిలిపించి మాట్లాడినట్లు తెలిపారు. వచ్చే వారం మళ్లీ సమావేశం ఏర్పాటుచేసి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ లీడర్పాల్వాయి హరీశ్ బాబు, బీఎంఎస్ లీడర్కల్లోల భట్టాచార్య, కమిటీ చైర్మన్ సూర్య ప్రకాశ్ రావు, కార్మికులు జాన్ ప్రకాశ్‌రావు, షబ్బీర్ హుస్సేన్, ఒళ్ళల వెంకటేశ్వర్లు, రాంచందర్, సునీల్ సింగ్, రాజమల్లు, లోకేశ్, అలోక్ శ్రీవాస్తవ తదితరులు ఉన్నారు.
ఎల్ఐసీ ఏజెంట్ల సమస్యలు పరిష్కరించాలి
ఆదిలాబాద్‌టౌన్/బెల్లంపల్లి, వెలుగు: ఎల్ఐసీ ఏజెంట్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆ సంఘం లీడర్లు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎల్ఐసీ ఆఫీస్‌ల ఎదుట ధర్నా నిర్వహించారు. ఆదిలాబాద్‌లో ఎమ్మెల్యే ఎమ్మెల్యే జోగు రామన్న మద్దతు తెలిపారు. ఆదిలాబాద్‌లో జరిగిన నిరసనలో లీడర్లు రామచంద్ర రెడ్డి, ఉష్కం నర్సింగ్, క్యాషియర్ ఆముల ఆశన్న, ఉపాధ్యక్షుడు దిగంబర్ పాటిల్ సిందే, బెల్లంపల్లిలో ఎం. అంజయ్య, సీహెచ్ సాయికృష్ణాగౌడ్, ఓదెలు, ఎం.రమేశ్, ఎం.సురేశ్, ఆర్.శేఖర్, సంతోష్ కుమార్, పి.వెంకటేశ్, ఓదెలు, శ్రీనివాస్, మొండయ్య, వెంకటేశ్ పాల్గొన్నారు.