బీఆర్ఎస్ పథకాలే పార్టీని గెలిపిస్తాయి : జోగు రామన్న

  •     కాంగ్రెస్​ మేనిఫెస్టో చెల్లని రసీదుతో సమానం : జోగు రామన్న

ఆదిలాబాద్ టౌన్, వెలుగు : తెలంగాణలో అమలవుతున్న పథకాలు, సీఎం కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలే పార్టీని మరోసారి గెలిపించి అధికారంలోకి తీసుకొస్తాయని ఎమ్మెల్యే జోగు రామన్న ధీమా వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి జోగురామన్న మంగళవారం ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. జందాపూర్ ఎక్స్ రోడ్ నుంచి భోరజ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భోరజ్ వద్ద ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి పథంలో నడుపుతున్న ఘనత సీఎం కేసీఆర్​కే దక్కిందన్నారు.

కర్ణాటకలో హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్.. ఇక్కడ మాత్రం మేనిఫెస్టోను ఏవిధంగా అమలు చేస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో చెల్లని రసీదుతో సమానమని, ఇంటర్నెట్​లోనూ ఆ పార్టీ వైఫల్యాలే కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. బీజేపీకి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్, ఎంపీపీ గోవర్ధన్, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు రోకండ్ల రమేశ్, పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, నాయకులు లింగారెడ్డి, నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.