ఆదిలాబాద్‌లో చికెన్ ప్రియులకు షాక్.. వారం రోజుల పాటు చికెన్‌ మార్కెట్‌ బంద్‌

ఆదిలాబాద్‌లో చికెన్ ప్రియులకు షాక్.. వారం రోజుల పాటు చికెన్‌ మార్కెట్‌ బంద్‌

ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లో చికెన్‌ మార్కెట్‌ బంద్‌ అయింది. వారం పాటు చికెన్ మార్కెట్ క్లోజ్ చేస్తున్నట్లు వ్యాపారులు ప్రకటించారు. బర్డ్‌ ఫ్లూ భయంతో చికెన్‌ అమ్మకాలు ఘోరంగా పడిపోవడమే ఇందుకు కారణం. వ్యాపారం లేక ఈగలు తోలుకునే పరిస్థితి ఉండటంతో చికెన్‌ మార్కెట్‌ను తాత్కాలికంగా బంద్‌ చేయడమే బెటరనే నిర్ణయానికి వ్యాపారులు రావడం గమనార్హం. ఆదిలాబాద్ పట్టణంలోని దాదాపు 200 చికెన్ షాపుల్లో ప్రతి ఆదివారం 15 టన్నుల చికెన్ అమ్మకాలు జరుగుతాయి. కానీ గత ఆదివారం(ఫిబ్రవరి 16, 2025) కనీసం 3 టన్నుల చికెన్ కూడా అమ్ముడుపోలేదని వ్యాపారులు చెబుతున్నారు. 

మొన్నటి వరకు కిలో చికెన్ రూ.240 ఉండగా, ఇప్పుడది రూ.160కి పడిపోయింది. ఆదిలాబాద్లో ప్రతి ఆదివారం రూ. 60 లక్షల నుంచి రూ.70 లక్షల చికెన్​అమ్మకాలు జరిగేవని, ఇప్పుడు 20  శాతం కూడా గిరాకీ కాలేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇక్కడ మటన్కు గిరాకీ పెరగడంతో కిలో ధర రూ.650 నుంచి రూ.750కి పెంచేశారు. ఆదిలాబాద్లోనూ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ చాలానే కనిపిస్తున్నది. పక్కనున్న మహారాష్ట్రలోని నాగ్పూర్, చంద్రపూర్లో బర్డ్ ఫ్లూ బయటపడడంతో.. జిల్లాలోని జనం చికెన్ తినేందుకు భయపడుతున్నారు.

చికెన్ షాపులే కాదు.. హోటల్స్, రెస్టారెంట్లలో కూడా చికెన్ ఐటమ్స్ ఆర్డర్లు తగ్గిపోయాయి. సాధారణ రోజుల్లో ఆర్డర్లలో 70 శాతం చికెన్ సంబంధిత వెరైటీలే ఉంటాయని.. కానీ ఇప్పుడు వాటి సేల్స్​తగ్గాయని నిర్వాహకులు చెప్తున్నారు. ఎక్కువగా చికెన్ బిర్యానీపై ఎఫెక్ట్​పడిందంటున్నారు. ఆదివారం ఎక్కువ మంది రెస్టారెంట్లకు వెళ్లి లంచ్/డిన్నర్ చేస్తుంటారు. మధ్యాహ్నం నుంచే రెస్టారెంట్లు కస్టమర్లతో కిటకిటలాడుతుంటాయి. కానీ బర్డ్​ఫ్లూఎఫెక్ట్తో కస్టమర్ల సంఖ్య కూడా తగ్గిందని రెస్టారెంట్ల నిర్వాహకులు చెబుతున్నారు. రెస్టారెంట్లు, హోటళ్లకు వచ్చి తినేవారి సంఖ్య 20 నుంచి 30 శాతం పడిపోయిందంటున్నారు.