నీట్ పరీక్షకు సెంటర్లను గుర్తించండి :కలెక్టర్ రాజర్షి షా

నీట్ పరీక్షకు సెంటర్లను గుర్తించండి :కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, వెలుగు: మే 4న జరిగే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) యూజీ పరీక్ష నిర్వహణకు జిల్లాలో ఎగ్జామ్​సెంటర్లను గుర్తించి రిపోర్ట్ సమర్పించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులను ఆదేశించారు. నీట్ పరీక్ష నిర్వహణకు సంబంధించి గురువారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో  ఎస్పీ గౌస్ ఆలంతో కలసి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.

నీట్ పరీక్ష కోసం జిల్లాలోని కేంద్రీయ విద్యాలయాలు, ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలను సందర్శించి మౌలిక వసతులు, చేపట్టాల్సిన చర్యలపై వెంటనే నివేదిక అందించాలని ఆదేశించారు.  

ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు 25 శాతం రిబేట్

ఎల్ఆర్ఎస్ 2020 స్కీం కింద ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం 25 శాతం రిబేట్​తో కూడిన చెల్లింపు విధానం తీసుకొచ్చిందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ ఫీజును మార్చి నెలాఖరులోపు చెల్లిస్తే 25 శాతం రిబేట్ వర్తిస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

గురువారం జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో లేఅవుట్ యజమానులు, డెవలపర్స్, మున్సిపల్, పంచాయతీ, రిజిస్ట్రేషన్, రెవెన్యు అధికారులతో సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
 
గంజాయిని కలిసికట్టుగా అరికడదాం

గంజాయిని అరికట్టేందుకు కలిసికట్టుగా పనిచేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై కలెక్టరేట్​లో వివిధ శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. ప్రతి కాలేజీలో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు. కమిటీలో ఓ పోలీసు, తల్లిదండ్రులు, విద్యార్థులు, అధ్యాపకులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం రోడ్ సేఫ్టీపై సమావేశం నిర్వహించారు.

జిల్లాలోని రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ గుర్తించాలని, ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఆయా సమావేశాల్లో అడిషనల్​ కలెక్టర్ శ్యామలా దేవి, సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రైనీ కలెక్టర్ అభిజ్ఞాన్, ఆర్డీవో వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.