సాగుకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : కలెక్టర్ ​రాజర్షి షా

సాగుకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : కలెక్టర్ ​రాజర్షి షా

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: పంట పొలాలకు, గృహావసరాలకు ఇబ్బందులు తలెత్తకుండా కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్​ సరఫరా చేయాలని కలెక్టర్ ​రాజర్షి షా విద్యుత్​ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆదిలాబాద్​ రూరల్​ మండలం అడ్డగుట్ట పంప్​ హౌస్​ను, తాంసి మండలంలోని సబ్​స్టేషన్​ను కలెక్టర్​ పరిశీలించారు. సాగునీరు ఏ మేరకు అందుబాటులో ఉందని అడిగి తెలుసుకున్నారు. ఆ ప్రాంతంలో రైతులు సాగు చేస్తున్న జొన్న పంటలకు సాగు నీరందక ఎండిపోవడాన్ని పరిశీలించారు. సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఎస్ఈ చవాన్, ఇరిగేషన్, మిషన్ భగీరథ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. 

లోవోల్టేజీ సమస్య తీర్చేందుకు కెపాసిటర్లు 

చెన్నూరు: వేసవిలో లోవోల్టేజి సమస్య రాకుండా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని, రైతుల పంటలు కాపాడాడేందుకు లైన్ కెపాసిటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్టీపీసీఎల్ ఏడీఈ బాలకృష్ణ తెలిపారు. చెన్నూరు​ మండలం నాగాపూర్ ఫీడర్ పరిధిలోని చాకెపల్లిలో పంట పొలాల వద్ద బుధవారం లైన్ కెపాసిటర్లను ఏర్పాటు చేయించారు. ఏడీ మాట్లాడుతూ తక్కువ వోల్టేజీ కారణంగా పంట పొలాల్లోని మోటార్లు కాలిపోయి పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్నందున, రక్షణ చర్యల్లో భాగంగా కెపాసిటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొమ్మెర ఏఈ కె.శ్రీనివాస్, లైన్ ఇన్​స్పెక్టర్లు రమేశ్ రెడ్డి, రాజమల్లు, లైన్ మెన్లు ఉన్నారు.

నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం 

లక్సెట్టిపేట: రైతుల వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్​అందించడమే లక్ష్యమని లక్సెట్టిపేట ట్రాన్స్ కో ఏఈ  గణేశ్​ అన్నారు. పొలంబాట కార్యక్రమంలో భాగంగా మండలంలోని తిమ్మాపూర్ లో రైతులు, విద్యుత్ సిబ్బంది కలిశారు. ట్రాన్స్​ఫార్మర్ల వద్ద ఎర్తింగ్, లూప్ లైన్స్, వంగిన  పోల్స్​ను సరిచేశారు. పొలాల్లోని మోటార్లకు కెపాసిటర్లు అమర్చుకోవాలని, ఫలితంగా నాణ్యమైన విద్యుత్ అందుతుందని రైతులకు ఏఈ సూచించారు.