ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా చూడండి : రాహుల్ రాజ్

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయాణ ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్​కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆదిలాబాద్, బోథ్ ఆర్టీసీ బస్టాండ్ లను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, ఆర్టీసీ అధికారులు అందిస్తున్న సేవలు, సౌకర్యాలను మహిళా ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు.

మహిళా ప్రయాణికులు ఇబ్బందుల్లేకుండా ప్రయాణం కొనసాగించేలా వారికి సహకరించాలని కండక్టర్లకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళలకు ఉచిత ప్రయాణం కార్యక్రమంలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు జిల్లాలో సుమారు 81 వేల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని తెలిపారు. మహిళలందరూ మహాలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిప్యూటీ రీజినల్ మేనేజర్ ప్రవీణ్, డిపో మేనేజర్ కల్పన, అధికారులు విశ్వనాథ్, శ్రీకర్, సిబ్బంది పాల్గొన్నారు