ఆదిలాబాద్, వెలుగు: ఎలాంటి ఆటంకాలు లేకుండా మిషన్ భగీరథ నీటిని ప్రజలకు నిరంతరం సరఫరా చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. శుక్రవారం భీంపూర్ మండలంలోని గొల్లఘాట్ గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. భగీరథ నీరు సరఫరా లేకపోవడంతో అవస్థలు పడుతున్నామని, రోడ్డు సరిగా లేదని, ఉపాధి హమీ బిల్లులు రావడం లేదని తెలిపారు.
స్పందించిన కలెక్టర్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వానికి నివేదిక పంపుతామని, ఉపాధి హామీ పెండింగ్ బిల్లుల విడుదలకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలన్నారు. పీఎం జన్మన్ పథకం క్రింద అర్హులైన వారికి ఇండ్ల నిర్మాణాలు, ఆధార్, ఇతర అవసరమైన ధ్రువీకరణ పత్రాల మంజూరుకు గ్రామంలో క్యాంప్ నిర్వహించాలని ఎంఆర్ఓ, ఎంపీడీఓలను ఆదేశించారు. గ్రామంలో కలెక్టర్ పర్యటించి సమస్యలను పరిశీలించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సత్యనారాయణ రావు, ఎంపీడీఓ గోపాలకృష్ణ రెడ్డి తదితరులున్నారు.