ఆదిలాబాద్, వెలుగు: జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిం దని, పంట నష్టంపై సర్వే చేస్తున్నట్లు ఆదిలా బాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. బేల మండలంలోని సాంగిడి, బెదోడ గ్రామాల్లో దెబ్బతిన్న పత్తి పంటలు, కల్వర్టులు, ఇండ్లను మంగళ వారం కలెక్టర్ పరిశీలించారు. నష్టం వివరాలను త్వరగా పంపాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎక్కడెక్కడ పంటలకు నష్టం వాటిల్లిందో సర్వే చేసి నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున వారి అకౌంట్ లో జమ చేస్తామని తెలిపారు. అలాగే ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 8 వరకు కూలిపోయిన ఇండ్ల వివరాలు తహసీల్దార్లు సేకరించాలని, వారి అకౌంట్లో రూ.16,500 జమచేస్తామన్నారు.
ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరుపుకోవాలి ప్రశాంత వాతావరణంలో గణేశ్ నిమజ్జనో త్సవం జరుపుకోవాలని కలెక్టర్ రాజర్షి షా కోరారు. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. గణేశ్ కమిటీ మెంబర్లు, గణేశ్ మండపాల నిర్వాహకులు, సంబంధిత అధికారులతో వినాయక నిమజ్జనోత్సవ ఏర్పాట్లపై కలెక్టరేట్లో రివ్యూ నిర్వహించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న చర్యలు, కమిటీ సభ్యుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
పలు చోట్ల రోడ్లు సరిగా లేవని, తాత్కాలిక మరమ్మత్తులు చేయించాలన్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూడాలని, శోభాయాత్ర కొనసాగే మార్గాల్లో సీసీ కెమెరా నిఘా ఉండేలా చూడాలని ఆదేశించారు. ఏమైనా సమస్యలుంటే 9492164153ను సంప్రదించాలన్నారు.