సమగ్ర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

సమగ్ర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
  • అధికారులకు కలెక్టర్ల సూచన

నెట్​వర్క్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేను పక్కాగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్‌ రాజర్షి షా అధికారులకు సూచించారు. శుక్ర వారం  భీంపూర్‌ మండలం తాంసి-కె, రిక్షాకాలనీ, శ్రీరాం కాలనీలలో చేపట్టిన సర్వే పరిశీలించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులవివరాల సేకరణకు ఈ నెల 6 నుంచి 18వ తేదీ వరకు సర్వేను నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇంటింటికి అతికిస్తున్న స్టిక్కర్లలో తప్పిదాలు లేకుండా చూడాలన్నారు.

మున్సిపల్‌ కమిషనర్‌ రాజు, డీవైఎస్‌ వో వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌ శ్రీనివాస్, తదితరులు ఉన్నారు. నిర్మల్​ జిల్లా సారంగాపూర్ మండలంలోని చించోలి( బి) గ్రామంలో సర్వే నిర్వహణకు అధికారులు చేస్తున్న సన్నద్ధత తీరును కలెక్టర్ అభిలాష అభినవ్ అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తో కలిసి పరిశీలించారు. గ్రామాలు, హౌస్ లిస్టింగ్ తీరుకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమగ్ర సర్వేలో ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో లక్ష్మీ కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

ఆసిఫాబాద్ మండలం అడ గ్రామపంచాయతీ, ఆసిఫాబాద్ పట్టణంలోని బజార్ వాడి ఏరియాల్లో కొనసాగుతున్న సర్వే ప్రక్రియ తీరును అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ పరిశీలించారు. సర్వే ప్రక్రియను జిల్లాలో అధికారులు సమన్వయంతో సమర్థంగా నిర్వహించాలన్నారు. సర్వే కోసం గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లను నియమించామని తెలిపారు.

ప్రతి ఎన్యుమరేటర్ ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు, కుటుంబ వివరాలు సేకరించాలన్నారు. మంచిర్యాల జిల్లా పొనకాల్ గ్రామపంచాయతీ గాంధీనగర్ లో సర్వే ప్రక్రియను డీఆర్డీవో, మండల స్పెషల్​ఆఫీసర్​కిషన్ పరిశీలించారు. ​ఎన్యూమరేటర్లకు సూచనలు, సలహాలు ఇచ్చారు.