- నేటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభం
ఆదిలాబాద్/ఆసిఫాబాద్/నస్పూర్, వెలుగు: ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వేను సమర్థంగా చేపట్టాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ లో నిర్వహించిన రివ్యూలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి ఒక డిజిటల్ కార్డు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక అర్బన్ వార్డు, గ్రామ పంచాయతీని పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ బృందాలకు ఇప్పటికే శిక్షణ ఇచ్చామని, గురువారం నుంచి క్షేత్రస్థాయిలో సర్వేను ప్రారంభిస్తారని తెలిపారు. ఈ నెల 8 నాటికి సర్వేను పూర్తి చేయాలని, 9న స్క్రుటినీ, 10న సమగ్ర నివేదిక పంపించాలని సూచించారు.
ఫ్యామిలీ డిజిటల్ కార్డు జారీ పైలెట్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్లు, డీఆర్వోతో కలిసి మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, సర్వే బృందాల ప్రతినిధులకు నిర్వహించిన ట్రైనింగ్‌కు హాజరయ్యారు. ఆసిఫాబాద్ మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు, కెరమెరి మండలంలోని ధనోర గ్రామపంచాయతీ, సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ మున్సిపల్ పరిధిలోని 14వ వార్డు, సిర్పూర్-టి మండలంలోని వెంకట్రావుపేట గ్రామపంచాయతీలను ఎంపిక చేసినట్లు చెప్పారు.
అన్నింటికీ ఒకటే ఫ్యామిలీ డిజిటల్ కార్డ్
ప్రభుత్వం అందించే అన్ని పథకాలను అర్హులకు అందించేందుకు ఫ్యామిలీ డిజిటల్ కార్డు జారీ కోసం పైలెట్ సర్వే నిర్వహిస్తున్నట్లు మంచిర్యాల ఆర్డీఓ రాములు తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాజెక్టు కోసం మంచిర్యాల నియోజకవర్గంలో దండేపల్లి మండలం అల్లిపూర్, మంచిర్యాల మున్సిపల్ పరిధిలొని 16వ వార్డు, బెల్లంపల్లి నియోజకవర్గంలో కాసిపేట మండలం లంబడితండా(కె) గ్రామం, బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని 16వ వార్డు, చెన్నూర్ మండలంలోని సంకారం, మున్సిపల్ పరిధిలోని 5వ వార్డును ఎంపిక చేసినట్లు చెప్పారు.