సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాను పక్కాగా రూపొందించాలి :  ​కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

  • అధికారులకు కలెక్టర్ల సూచన

ఆసిఫాబాద్/ఆదిలాబాద్, వెలుగు: ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇతర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేసి గ్రామ సభల ద్వారా అర్హులైన లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని ఆసిఫాబాద్​కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సూచించారు. బుధవారం కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారీ, ఎం.డేవిడ్​తో కలిసి మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవో, ఎంపీవో, మండల వ్యవసాయ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించారు.

కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పథకాల ఫలాలు అందేలా అధికారులు కృషి చేయాలని తెలిపారు. ప్రభుత్వం ఈనెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమలు చేయనున్న పథకాల కోసం అర్హులైన లబ్ధిదారుల జాబితాను రూపొంచేం దుకు సమన్వయంతో పని చేయాలన్నారు.

ఫీల్డ్ వెరిఫికేషన్ పకడ్బందీగా చేపట్టాలి

జిల్లా వ్యాప్తంగా పట్టణాలు, గ్రామాల్లో ఫీల్డ్ వెరిఫికేషన్ పకడ్బందీగా చేపట్టాలని ఆదిలాబాద్​కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపై జడ్పీ హాల్​లో  సమావేశం నిర్వహించారు.

ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా, అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్​తో కలిసి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ఫీల్డ్ వెరిఫికేషన్ పక్కా ప్రణాళిక ప్రకారం చేపట్టాలని ఆదేశించారు.  ఈనెల 16 నుంచి 20 లబ్ధిదారుల జాబితా తయారీ, 21 నుంచి 24 వరకు గ్రామ సభలు, 25 వరకు డేటా ఎంట్రీ చేయనున్నట్లు 
తెలిపారు.