
ఆదిలాబాద్, వెలుగు: పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి మొదటి విడత శిక్షణ కార్యక్రమం శనివారం జడ్పీ మీటింగ్ హాల్లో నిర్వహించి మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఈనెల 27న జరుగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తిచేయాలన్నారు. ఎన్నికలపై సందేహాలున్నా, శిక్షణ తరగతుల్లో మాస్టర్ ట్రైనర్లను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. ఎన్నికలకు 220 మంది ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు 9 మంది జోనల్ ఆఫీసర్లను నియమించినట్లు తెలిపారు.
బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియలో ఓటింగ్ నిర్వహణకు ఎక్కువ సమయం పట్టే అవకాశాలు ఉన్నందున సంయమనంతో వ్యవహరిస్తూ సమర్థంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. పోలింగ్‌కు ఒక రోజు ముందుగానే ప్రిసైడింగ్ అధికారులు తమ బృందంతో డిస్ట్రిబ్యూ షన్ సెంటర్లకు చేరుకోవాలని సూచించారు. పంపిణీ కేంద్రాల వద్ద అందించే పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ బాక్సులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్యామలా దేవి, సబ్ కలె క్టర్ యువరాజ్, ట్రైనీ కలెక్టర్ అభిజ్ఞాన్, తహసీల్దార్ శ్రీనివాస్, ఏవో రామిరెడ్డి తదితరులు ఉన్నారు.