మారుమూల ప్రాంతాలకు పథకాలు అందిస్తాం : కలెక్టర్ రాజర్షి షా

మారుమూల ప్రాంతాలకు పథకాలు అందిస్తాం : కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, వెలుగు : జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పీఎం జన్ మన్ యోజన పథకంపై గురువారం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో పీవో ఖుష్బూ గుప్తా, సంబంధిత శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లోని గిరిజనుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పీఎం జన్​మన్ యోజన పథకం ప్రవేశపెట్టిందని.. పీవీటీజీ గ్రూపులను గుర్తించి సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందించే దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. 

జిల్లాలో పక్కా ఇండ్ల నిర్మాణం, రహదారుల అభివృద్ధి, మొబైల్ మెడికల్ యూనిట్ల ద్వారా ఆరోగ్య పరిరక్షణ, నిరంతర నీటి సౌకర్యం, ప్రతి ఇంటికీ విద్యుత్, అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు, మల్టీపర్పస్ కేంద్రాలు, సోలార్ వీధి దీపాలు, మొబైల్ టవర్లు, ఒకేషనల్ విద్యా కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో 22 మల్టీ పర్పస్ సెంటర్లు మంజూరు కాగా అందులో 4 సెంటర్లను పూర్తి చేశామన్నారు. వాటిల్లో అంగన్వాడి కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని అధికారులను ఆదేశించారు. 

ఇప్పటివరకు కరెంట్ సరఫరా లేని హ్యాబిటేషన్‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటే నివేదికలు పంపాలని సూచించారు. అంతమకుందు ఉట్నూర్ ఐటీడీఏ ఆద్వర్యం ఓల్డ్ కోర్టు బిల్డింగ్ లో ఏర్పాటు చేసిన శానిటరీ నాప్​కిన్స్ కేంద్రాన్ని కలెక్టర్, ఖుష్బూ గుప్తా ప్రారంభించారు. సమావేశంలో సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రైనీ కలెక్టర్ అభిజ్ఞాన్ పాల్గొన్నారు.