ఆదిలాబాద్, వెలుగు: సంపూర్ణ స్వచ్చత అందరి బాధ్యత అని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. వరల్డ్ టాయిలెట్ డేను పురస్కరించుకొని నవంబర్ 19 నుంచి డిసెంబర్ 10 వరకు ‘హమారా శౌచాలయ్- హమారా సమ్మాన్’ పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ అంశంపై జిల్లా అధికారులతో కలిసి మంగళవారం పాంప్లెంట్లను విడుదల చేశారు.
మరుగుదొడ్డిని పరిశుభ్రంగా ఉంచుకోవడం, వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లను సుందరీకరించుకోవడం, స్వచ్ఛత కోసం కృషి చేసిన పారిశుధ్య కార్మికులను గుర్తించి సన్మానించడం వంటి కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.
కలెక్టర్ రక్తదానం
ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలంలోని ఝరి గ్రామంలో మంగళవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహిచగా కలెక్టర్ ప్రారంభించి రక్తదానం చేశారు. అత్యవసర సమయంలో రక్తం దొరకక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని, రక్తదానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ప్రజాపాలన కళాయాత్ర ప్రారంభం
ప్రజావిజయోత్సవాలను పురస్కరించుకొని కలెక్టర్ రాజర్షి షా, అడిషనల్ కలెక్టర్ శ్యామలా దేవి ప్రజాపాలన కళాయాత్రను ప్రారంభించారు. డిసెంబర్ 7 వరకు జిల్లాలోని అన్ని మండలాల్లోని గ్రామాల్లో, మున్సిపాలిటీలో సాంస్కృతిక కళాకారులతో ప్రజా విజయోత్సవాలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలపై ప్రచారం చేయనున్నట్లు చెప్పారు. అనంతరం జైనథ్ మండలంలోని మేడిగూడ జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని పరిశీలించారు.