- కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, వెలుగు: జిల్లాల్లోని అన్ని హైస్కూళ్లను ఆరోగ్య పాఠశాలలుగా మార్చే బాధ్యత అందరిపై ఉందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం రిమ్స్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పాఠశాలల్లో విద్యార్థులు వ్యాధుల బారిన పడకుండా, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసేందుకు, వారిలో ఆత్మ విశ్వాసం, సామాజిక నైపుణ్యాలు పెంపొందించేందుకు ఈ కార్యక్రమం రూపొందించినట్లు చెప్పారు. నవంబర్ 14 నుంచి అన్ని హైస్కూళ్లు, కేజీబీవీ, ఇంటర్ కాలేజీల్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు.
నాలుగు వారాల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రతి సోమవారం వ్యక్తిగత పరిశుభ్రత, మంగళవారం పోషకాహారంపై అవగాహన, బుధవారం ఒత్తిడి నివారించుకునే మార్గాలు, గురువారం డ్రగ్స్‌కు దూరంగా ఉండడం, శుక్రవారం కాలానుగున వ్యాధుల నివారణ, శనివారం వ్యక్తిత్వ వికాసం ఈ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, డీఈవో ప్రణీత, జిల్లా సంక్షేమ అధికారి సబిత, స్త్రీ శిశు సంక్షేమ అధికారి మిల్కా, ఇంటర్ విద్యాశాఖ అధికారి రవీందర్ పాల్గొన్నారు.