ఆదిలాబాద్, వెలుగు: యువత అగ్నివీర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మంగళవారం పట్టణంలోని ఎస్టీయూ భవన్లో ఇండియన్ ఎయిర్ఫోర్స్ రిక్రూట్మెంట్ అవేర్నెస్ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు అగ్నివీర్ కోసం జనవరి 27 వరకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలని, మార్చి 22న ఆన్ లైన్ పరీక్ష ఉంటుందన్నారు. 2005 జనవరి 1 నుంచి 2008 జూలైలో జన్మించిన వారు అర్హులన్నారు.
టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి
టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు వంద రోజుల కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ నేషనల్ టీబీ ఎలిమినేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సిబ్బందికి టీబీ పరీక్షలు నిర్వహించగా.. పరీక్షల తీరును కలెక్టర్ పరిశీలించారు. 100 రోజుల కార్యక్రమంలో 200 మంది ఉద్యోగులకు రక్త పరీక్షలు, ఎక్సరే, టీబీ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తెలిపారు. డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, రిమ్స్ డెరైక్టర్ జై సింగ్ రాథోడ్, టీబీ అధికారి సుమ పాల్గొన్నారు.