
- నేడు ప్రధాని చేతుల మీదుగా అందుకోనున్న రాజర్షి షా
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ బ్లాక్ ఆస్పరేషనల్ ప్రోగ్రాం 2024 కు ఎంపికైంది. సివిల్ సర్వీస్ డే సందర్భంగా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అవార్డు అందుకోనున్నారు. ప్రధానమంత్రి ప్రజాస్వామ్య పరిపాలన ఉత్తమ పురస్కారం 2024లో భాగంగా నార్నూర్ బ్లాక్ దేశంలోనే టాప్–5లో నిలిచింది. దేశంలో 426 ఆస్పిరేషనల్ బ్లాకులలో జిల్లాలోని నార్నూర్ బ్లాక్ అద్భుతమైన విజయాలను నమోదు చేసి గుర్తింపు పొందింది.
పరిపాలన, అభివృద్ధిలో అద్భుతమైన పనితీరుకు జాతీయ స్థాయిలో ఈ అవార్డు అందిస్తారు. 2022 ఏప్రిల్ నుంచి 2024 డిసెంబర్ వరకు చేపట్టిన అభివృద్ధి పనుల్లో సమగ్ర అభివృద్ధి సాధించినందుకు నార్నూర్ మండలానికి ఈ గుర్తింపు లభించిందని, అవార్డు రావడం సంతోషం కలిగించిందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు.