
- ప్రధాని మోదీ చేతుల మీదుగా ఢిల్లీలో అవార్డు అందుకున్న కలెక్టర్ రాజార్షీషా
న్యూఢిల్లీ, వెలుగు: ప్రతిష్టాత్మకమైన ప్రధాన మంత్రి పబ్లిక్ ఆడ్మినిస్ట్రేషన్ అవార్డును ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్ బ్లాక్ ఎంపికైంది. ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రొగ్రాం (ఏబీపీ)లో ఉత్తమ పనితీరును కనబర్చినందుకు 2024 ఏడాదికి గాను ఈ అవార్డును కేంద్రం ప్రకటించింది. పరిపాలన, అభివృద్ధిలో అద్భుతమైన పనితీరుకు జాతీయ స్థాయిలో ఈ అవార్డును అందిస్తారు. సోమవారం 17వ సివిల్ సర్వీసెస్ డే పురస్కరించుకొని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షీషా ఏబీపీ అవార్డును అందుకున్నారు.
దేశవ్యాప్తంగా 500 ఏబీపీ బ్లాక్‌లు పోటీ పడగా.. నార్నూర్ బ్లాక్ టాప్ 5లో నిలిచింది. జిల్లాలో 100 శాతం టీబీ స్ర్కీనింగ్, పోషకాలు అందించే నోవా లడ్డూ తయారీ, హైస్కూల్స్‌లో 70 శాతం ల్యాబ్‌లు, 1,200 మంది రైతులకు న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా నేరుగా లబ్ధి, పంచాయతీల్లో 74% సీఎస్సీ సెంటర్ల ఏర్పాటు, అంగన్ వాడీ కేంద్రాల్లో 100% పిల్లల పెరుగుదలలో అత్యుత్తమ పనితీరును సాధించింది. తెలంగాణతో పాటు కేరళలోని కరప్ప, జార్ఖండ్‌లోని గమరియా, త్రిపురలోని గంగానగర్, మధ్యప్రదేశ్‌లోని రామ బ్లాక్‌కు ఈ అవార్డులు వరించాయి. 2024 ఏడాదికి గాను 3 విభాగాల్లో మొత్తం 14 అవార్డులను మోదీ అందజేశారు.