జన్నారం, వెలుగు: ‘ఓ ఆడబిడ్డగా మీ ముందుకొచ్చి కొంగు చాచి అడుగుతున్నా ఓట్లు వేసి నన్ను గెలిపించండి’ అని ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణ ఓటర్లను కోరారు. మంగళవారం జన్నారం మండల కేంద్రంలోని పైడిపెల్లి పంక్షన్ హాల్లో నిర్వహించిన మండల స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జుపటేల్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితం జన్నారం మండలంలోనే ప్రారంభమైందని, ఇక్కడ ఎంపీటీసీగా గెలిచి ప్రజలకు సేవ చేశానని గుర్తుచేశారు.
అదివాసీ మహిళనైన తనకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టిక్కెట్ ఇచ్చిందని, ప్రజలకు మరోసారి సేవ చేసేందుకు టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి మీ ముందుకు వచ్చానన్నారు. తనను గెలిపిస్తే ఎళ్లవేళలా అందుబాటులో ఉండి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని పేర్కొన్నారు. బీజేపీ రాముడి పేరుతో రాజకీయం చేస్తోందని, పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న కాంగ్రెస్కు మద్దతివ్వాలని కోరారు.
సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా ప్రతి కార్యకర్త కష్టపడి పార్టీ విజయానికి కృషి చేయాలని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కోరారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటానన్నారు. ప్రతి కార్యకర్తలు, నేత ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి ప్రభుత్వ పథకాలను వివరించాలని సూచించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ ముజాఫర్ ఆలీఖాన్, సీనియర్ నాయకులు రాజశేఖర్, మోహన్ రెడ్డి, సుభాష్ రెడ్డి, ఎంపీటీసీ రియాజొద్దిన్ తదితరులు పాల్గలొన్నారు.