కాంగ్రెస్ బీసీ ఐక్యవేదిక సభలో రచ్చ.. రచ్చ

కాంగ్రెస్ బీసీ ఐక్యవేదిక సభలో రచ్చ.. రచ్చ
  • ఆదిలాబాద్​లో బయటపడ్డ వర్గపోరు

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్​ కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గపోరు బయటపడింది. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్​లో నిర్వహించిన పార్టీ బీసీ ఐక్యవేదిక సభ రసాభాసగా మారింది. పార్టీ నేత కంది శ్రీనివాస్​రెడ్డి సమావేశానికి వస్తుండగా డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ వర్గం అడ్డుకోవడంతో గొడవ మొదలైంది. ‘ఇది బీసీ సభ, నీకు ఇన్విటేషన్​లేదు’ అంటూ సాజిద్ వర్గీయులు అడ్డుకోగా.. కంది అనుచరులు గేటు తోసుకుంటూ లోపలికి వచ్చారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. 

కంది శ్రీనివాస్ రెడ్డి వేదికపై కూర్చున్న తర్వాత కూడా ఆయన అనుచరులు శాంతించలేదు. వారికి నచ్చజెప్పేందుకు సీనియర్​నేత వి.హన్మంతరావు ప్రయత్నించినా వినిపించుకోలేదు. వీహెచ్​కండువాను లాక్కునే ప్రయత్నం చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు సాజిద్ ఖాన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత మీటింగ్ నుంచి బయటకు వెళ్లిపోయారు. కంది శ్రీనివాస్ రెడ్డి వెళ్లిపోయిన తర్వాత వారు తిరిగి వచ్చారు. శ్రీనివాస్ రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని వీహెచ్​చెప్పారు. 

శ్రీనివాస్ రెడ్డి సస్పెన్షన్​

పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న  శ్రీనివాస్ రెడ్డిని పార్టీ నుంచి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ప్రకటించారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను బౌన్సర్లు, అనుచరులతో దాడి చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సస్పెన్షన్​పై పీసీసీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. బీసీ ఐక్యవేదికకు హాజరుకాకుండా గేట్లకు తాళాలు వేసి తనను అడ్డుకోవడం దురదృష్టకరమని కంది శ్రీనివాస్ రెడ్డి మీడియాతో తెలిపారు. పార్టీలోకి చొర‌‌‌‌బ‌‌‌‌డ్డ కొన్ని సంఘ విద్రోహ శక్తులతోనే ఈ ఘటన జరిగిందని, అధిష్టానం చూసుకుంటుంద‌‌‌‌ని అన్నారు.