బాల్క సుమన్‌‌ నోరు అదుపులో పెట్టుకో

  •     ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌‌ శ్రేణుల నిరసనలు 
  •     బాల్క సుమన్‌‌ను వెంటనే అరెస్టు చేయాలి 
  •     దిష్టిబొమ్మల దహనం, ఎక్కడికక్కడ నిరసనలు 

వెలుగు, నెట్‌‌ వర్క్‌‌ :  బీఆర్‌‌‌‌ఎస్‌‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌‌ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌‌ శ్రేణులు భగ్గుమన్నాయి.  జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, పట్టణాల్లో నిరసనలు, ధర్నాలు చేపట్టి సుమన్ దిష్టిబొమ్మను దహనం చేశాయి.   మంగళవారం కాసిపేట మండలం యాప చౌరస్తాలో మండల కాంగ్రెస్‌‌ అధ్యక్షుడు వేముల కృష్ణ ఆధ్వర్యంలో బాల్క సుమన్ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దహనం చేశారు.  సుమన్‌‌ను గోదావరి దాటనీయకుండా చేస్తామని జైపూర్‌‌‌‌ మండలంలోని కాంగ్రెస్ పార్టీ లీడర్లు హెచ్చరించారు.  

సుమన్ ఫ్లెక్సికీ చెప్పుల దండ వేశారు.  లక్షెట్టిపేట పట్టణంలోని  ఊట్కూర్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై  రాస్తా రోకో నిర్వహించి బాల్క సుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు.  బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లీడర్లు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. బాల్క సుమన్‌‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.  నస్పూర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, ఐఎన్టీయూసీ లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సీసీసీ కార్నర్ వద్ద, శ్రీరాంపూర్ ఓసీపీ గేట్ వద్ద దిష్టిబొమ్మను దహనం చేసి సుమన్ ప్లెక్సీకీ చెప్పుల దండ వేసి గాడిదపై తిప్పారు.  

సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన  చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కాంగ్రెస్ నాయకులు బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో వన్ టాన్ ఎస్సై ప్రవీణ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు.  యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పొద్దుటూరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో కడెంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి బాల్క సుమన్ దిష్టిబొమ్మ దహనం చేశారు.  బాల్క సుమన్ అహంకారంతో మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామని యువజన కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు సాయిచరణ్​గౌడ్​ హెచ్చరించారు.

 చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై మంచిర్యాల కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి.  బెల్లంపల్లి చౌరస్తాలో సుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు.  బ్లాక్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు పూదరి తిరుపతి, మహిళా కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత పాల్గొన్నారు.