ఏసీబీకి చిక్కిన ఆదిలాబాద్ డీఈఎంఓ

ఏసీబీకి చిక్కిన ఆదిలాబాద్ డీఈఎంఓ
  • రూ.30వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

ఆదిలాబాద్:ఓ మెడికల్​షాపు నిర్వాహకుడి నుంచి రూ.30వేలు లంచం తీసుకుంటూ ఆదిలాబాద్​ జిల్లా ఎక్స్టెన్షన్ మెడికల్అధికారి రవిశంకర్​ ఏసీబీకి పట్టుబడ్డారు. మాస్​ మీడియా అధికారిగా అదనపు బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ఆయన గుడిహత్నూరు మండలం మన్నూరు గ్రామంలో మూడు రోజుల క్రితం ఓ మైనర్ బాలిక అబార్షన్ విషయంలో తన మెడికల్ నుంచే మందులు సరఫరా అయ్యాయని అనుమానాలు వ్యక్తం చేస్తూ స్థానికంగా ఉన్న ఓ మెడికల్ షాపును నిన్న తనిఖీ  చేశారు.

ఈ కేసులో తన పేరు లేకుండా ఉండాలంటే రూ. 30 వేలు ఇవ్వాలని షాపు నిర్వాహకుడిని డిమాండ్​ చేశాడు. అధికారి అడిగిన ప్రకారం లంచం ఇచ్చేందుకు ఒప్పుకున్న షాపు నిర్వాహకుడు ఇవాళ డీఎంహెచ్​ఓ కార్యాలయంలో ఆ మొత్తం ఇచ్చేందుకు వెళ్లాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా రవిశంకర్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలోని మాస్ మీడియా అధికారి చాంబర్లో ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.