
- ఎండిన వాగులు.. ఎడారుల్లా చెరువులు
- రెండురోజులకోసారి తాగునీటి సప్లై
- ఎండలు మరింత ముదిరితే కటకటే
ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లాలో నీటికొరత రోజురోజుకు తీవ్రమవుతోంది. నిరుటికన్నా పరిస్థితి దారుణంగా మారింది. భూగర్భ జలాలు వేగంగా పడిపోవతుండటంతో అధికారులు, ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి.
ఎన్నడూ ఎండిపోని చెరువులు, వాగులు ఈ సీజన్లో పూర్తిగా ఎండిపోయి కనిపిస్తున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో మరింత నీటి ఎద్దడి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని గ్రౌండ్‌వాటర్ డిపార్ట్మెంట్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో గ్రౌండ్ వాటర్ లెవల్ మరింత తగ్గి నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. ఇప్పటికే చాలా చోట్ల భగీరథ నీళ్లు రోజురోజు విడిచి వస్తోంది.
1.60 మీటర్లకు లోతుకు..
జిల్లాలో జనవరి నెలతో పోల్చుకుంటే భూగర్భ జలమట్టం 1.60 మీటర్ల లోతుకు పడిపోయింది. జనవరిలో 7.05 మీటర్ల దగ్గరున్న నీళ్లు మార్చి చివరి నాటికి 8.68 మీటర్లకు తగ్గిపోయాయి. మరో రెండు నెలల్లో ఇంకా 3 మీటర్ల లోతుకు చేరుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గాదిగూడ మండలంలో భూగర్భ జలాలు అగాధానికి చేరాయి. ఇక్కడ జనవరిలో 18.30 మీటర్ల వద్ద ఉన్న నీటిమట్టం 19.10 మీటర్లకు పడిపోయింది. ఈ ఏడాది వర్షాలు సరిగా లేక భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నట్లు చెప్తున్నారు. నీటి ఎద్దడి నివారణకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సి అవసరం ఉంది.
మరింతగా పడిపోయే ప్రమాదం
జిల్లాలో రోజురోజుకు భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. వచ్చే రెండు నెలలు మరింత ప్రమాదంగా మారిపోయే అవకాశం ఉంది. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలి. నీటిని వృథా చేయకుండా చర్యలు తీసుకోవాలి. నీటి గుంటలు ఏర్పాటు చేసుకోవాలి. - శ్రీవల్లి, భూగర్బ జల శాఖ ఏడీ
నీళ్లు పూర్తిగా ఎండిపోయి బండలు బయట పడిన ఈ ప్రాంతం భీంపూర్ మండలంలోని అంతర్గావ్ గ్రామం పెన్ గంగా నది . గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రాంతంలో పెన్ గంగా నది పూర్తిగా ఎండిపోయి ఎడారిని తలపిస్తోంది. సాగునీటికి రైతులు మోటర్లు పెట్టుకొని ఇక్కడి నుంచే నీటిని ఆరు తడి పంటలకు అందిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా నీళ్లు లేకపోవడంతో రోజు తప్పించి రోజు నీటికి పంటలకు అందిస్తున్నారు.
ఈ ఫోటోలో ఎండిపోయి కనిపిస్తున్నది ఆదిలాబాద్ పట్టణానికి నీటిని సరఫరా చేసే లాండసాంగ్వి వాగు. ఇక్కడ ఏర్పాటు చేసిన మూడు మోటర్ల ద్వారా ఆదిలాబాద్ పట్టణంలోని 17 వార్డుల్లో దాదాపు 50 వేల మందికి తాగునీరు అందుతోంది. గతంలో వాగు ఎండిపోవడం ఎప్పుడు జరగలేదని గ్రామస్తులు అంటున్నారు. వాగు అడుగంటిపోతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నీటి నిల్వలు తగ్గిపోవడంతో రెండురోజులకోసారి నీటిని సప్లై చేస్తున్నారు. ఒకరోజు ఆగితేగాని మోటర్లు ఎత్తిపోసేంత నీరు చేరడంలేదని అధికారులు చెబుతున్నారు. వాగులోనే బోర్లు వేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు.