ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు ఇదివరకే మొదలైనా.. ఆదిలాబాద్ మార్కెట్ కు మాత్రం రైతులు సరుకు తేవడం లేదు. నెల రోజుల కిందట కొనుగోళ్లు ప్రారంభం కాగానే పత్తిని మార్కెట్ కు తెచ్చిన పలువురు రైతులు సరైన ధర రాక నష్టపోయారు. మొదట క్వింటాలుకు రూ. 9 వేల వరకు ధర రాగా... వ్యాపారులు రకరకాల సాకులతో 15 రోజుల్లోనే రూ. వేయి రేటు తగ్గించారు. తిరిగి రేటు రూ. 9 వేలకు చేరినా రైతులు ఇంకా మంచి రేటు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్లో భారీ వానలు, చీడపీడలతో పత్తి దిగుబడి బాగా తగ్గింది. దీనికితోడు రేటు లేకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. మంచి ధర వచ్చే దాకా వేచిచూడాలని భావిస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో బేల్ ధరలు పెరుగుతుండడంతో పత్తి రేటు మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. దీంతో పత్తి ఏరడం జోరుగా సాగుతున్నా సరుకును ఇండ్లలోనే నిల్వ చేస్తున్నారు. జిల్లాలో అక్టోబర్ 14 నుంచి పత్తి కొనుగోళ్లు జరుగుతున్నాయి. మెదటి రోజు క్వింటాలుకు రూ. 8,300 ధర రాగా.. ఆతర్వాత రూ. 9 వేలకు చేరింది. పత్తి ఎక్కువ రావడంతో వ్యాపారులు క్రమంగా ధర తగ్గించుకుంటూ పోయారు. రూ. వెయ్యి వరకు తగ్గడంతో ఆ రేటుకు అమ్ముకుంటే పెట్టుబడి డబ్బులు కూడా రావని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముసురు వాన, గులాబీ పురుగు వల్ల దిగుబడి తగ్గి.. ఒకటిరెండు సార్లు ఏరితే చేను ఖాళీ అయిపోతుంది.
ఎకరానికి 3 క్వింటాళ్లు కూడా రావడం లేదని అంటున్నారు. దీనికి తోడు కూలీల రేట్లు కూడా పెరిగాయి. గత ఏడాది రోజుకు రూ. 250 కూలీ ఉండగా.. ఈసారి రూ. 300 ఇస్తే గాని రావడంలేదు. మహారాష్ట్ర నుంచి వచ్చే కూలీలకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా ఇవ్వాల్సి రావడం రైతుకు భారంగా మారుతోంది. ఇప్పుడున్న రేటుకు అమ్ముకొని నష్టపోయే బదులు ధర పెరిగిన తర్వాతే మార్కెట్ కు తరలించాలని భావిస్తున్నారు. ఇప్పటికే రైతుల దగ్గర పెద్ద ఎత్తున పత్తి నిల్వలు ఉన్నాయి. మహారాష్ట్ర వ్యాపారులు బార్డర్ గ్రామాలకు నేరుగా వచ్చి పత్తి కొంటున్నారు. క్వింటాలుకు రు. రూ.8,500 ఇస్తున్నారు. తేమ పేర కోతలు, రవాణా ఖర్చులు లేకపోవడంతో కొందరు వారికే పత్తి అమ్ముకుంటున్నారు. చాలామంది మాత్రం క్వింటాలు రేటు రూ. 10 వేలు దాటిన తర్వాతే అమ్ముకోవాలని అనుకుంటున్నారు. ఆదిలాబాద్ మార్కెట్లో నిరుడు క్వింటాలుకు అత్యధికంగా రూ.10,600 ల రేటు కు కొనుగోలు చేశారు. ఈ ఏడాది కూడా అదే రేటు పలుకుతుందని రైతులు ఆశిస్తున్నారు. గత ఏడాది నెల రోజుల్లో 1.85 లక్షల క్వింటాళ్ల పత్తి మార్కెట్ కు రాగా.. ఈసారి నెల రోజుల్లో 29 వేల క్వింటాళ్ల పత్తి మాత్రమే మార్కెట్ కు వచ్చింది.
ధర పెరిగే అవకాశం ఉంది
ఆదిలాబాద్ మార్కెట్లో ప్రస్తుతం మార్కెట్ లో పత్తి ధర రూ. 9 వేలకు చేరుకుంది. అంతర్జాతీయంగా బేల్ ధర పెరుగుతుండటంతో పత్తి ధర పెరిగే అవకాశం ఉంది. రైతులు ఇప్పటికీ పత్తిని మార్కెట్ కు తీసుకురావడం లేదు. ఇండ్లోనే నిల్వ చేసుకోవడంతో ఇప్పటి వరకు 29 వేల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశాం. మరో మూడు నెలల వరకు పత్తి దిగుబడి ఉంటుంది. - శ్రీనివాస్, ఏడీ , మార్కెటింగ్‌శాఖ