
- అక్రమంగా ట్రాన్స్‌ఫర్ చేసుకున్న పోస్టల్ మేనేజర్
- విషయం తెలియడంతో ఆందోళనకు దిగిన రైతులు
- సుమారు 100 మంది రైతులకు రూ. కోటికి పైగా కుచ్చుటోపి
ఆదిలాబాద్ టౌన్, వెలుగు : రైతులకు అందాల్సిన డబ్బులను ఓ పోస్టల్ మేనేజర్ తన సొంత అకౌంట్లోకి మళ్లించుకున్నారు. విషయం తెలుసుకున్న రైతులు పోస్ట్ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. ఆదిబాలాద్, బోథ్ నియోజకవర్గాలకు చెందిన రైతులు మూడు, నాలుగు నెలల కింద సీసీఐకి పత్తి అమ్మారు. వాటికి సంబంధించిన డబ్బులు ఆధార్ కార్డ్‌తో లింక్ ఉన్న జాబ్‌కార్డు అకౌంట్‌లో డిపాజిట్ అయ్యాయి. అయితే ఈ అకౌంట్ నుంచి రోజుకు రూ.10 వేలకు మించి డబ్బులు తీసుకునే అవకాశం లేదు. దీంతో తమ అకౌంట్‌లో ఉన్న డబ్బులను మరో సేవింగ్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయాలని రైతులు పోస్టల్ మేనేజర్ విజయ్ జాదవ్ చుట్టూ తిరుగుతున్నా వివిధ కారణాలు చెబుతూ ఆలస్యం చేస్తూ వచ్చాడు.
ఇటీవల ఓ రైతు గట్టిగా నిలదీయడంతో తన పర్సనల్ అకౌంట్ నుంచి రూ. 1.50 లక్షలను సదరు రైతు అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేశాడు. పోస్టల్ అకౌంట్ నుంచి కాకుండా మేనేజర్ పర్సనల్ అకౌంట్ నుంచి డబ్బులు రావడంతో అనుమానం వచ్చిన ఆ రైతు, మిగతా వారితో కలిసి పోస్ట్ ఆఫీస్ వద్దకు వచ్చి ఆరా తీశాడు. రైతులకు తెలియకుండా వారి డబ్బులను మేనేజర్ తన సొంత అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకున్న విషయం బయటపడింది. దీంతో రైతులు ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ పోస్టల్ ఆఫీస్‌కు వచ్చి రైతులతో మాట్లాడారు.
సదరు ఆఫీసర్‌పై చర్యలు తీసుకోవాలని ఎస్పీ, కలెక్టర్‌తో పాటు, సంబంధిత పోస్టల్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. ఈ విషయంపై విచారణ చేసేందుకు పోస్టల్ ఆఫీసర్లు సైతం వస్తున్నారని, రైతులు అధైర్యపడొద్దని డబ్బులు తిరిగి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. సుమారు 100 మంది రైతులకు సంబంధించి రూ.కోటి మోసం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం సదరు పోస్టల్ మేనేజర్ పరారీలో ఉన్నారు.