దెబ్బతిన్న రోడ్లకు రిపేర్లెప్పుడు

  •     వర్షాలకు తెగిన రోడ్లు, వంతెనలు 
  •      మరమ్మతులకు నిధులివ్వని సర్కార్​ 
  •      తాత్కాలిక పనులతో మమా
  •      గుంతల రోడ్లపై ప్రయాణం.. అవస్థలు పడుతున్న ప్రజలు 

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు పంటలు, రోడ్లు, వంతెనలు, ఇండ్లు దెబ్బతిని కోట్లలో  నష్టం వాటిల్లింది. రోడ్ల , వంతెనల  మరమ్మతుల  కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. పంట నష్టం పై ఇప్పటి వరకు అధికారికంగా సర్వే కూడా చేయించలేదు.  పంచాయతీ రాజ్  ఆర్​అండ్​ బీ   రోడ్లపై   పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. కొన్ని రోడ్లు కొట్టుకుపోయాయి. 

అయితే దెబ్బతిన్న రోడ్ల  మరమ్మతుల కోసం   ప్రభుత్వానికి ప్రపోజల్స్​ పంపినా  ఎలాంటి స్పందన లేదు.  కొన్ని చోట్ల మాత్రమే అక్కడక్కడ మొరం, మట్టి పోసి  రాకపోకలు ప్రారంభిస్తున్నారేతప్ప శాశ్వత పరిష్కారం చూపించడం లేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. 

నేరడిగొండ మండలం బోరిగాం గ్రామం రోడ్డు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా కూలిపోయింది. జులై 28న ఈ రోడ్డును కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించి మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. కానీ ఇంతవరకు ఆపని జరగలేదు. కలెక్టర్ ఆదేశించినా పనులు ప్రారంభం కాకపోగా మిగతా చోట్ల పరిస్థితి ఎలా ఉంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఈ ఫోటోలో కనిపిస్తున్న గుంతలమయమైన రోడ్డు బజార్​ హత్నూర్ మండలంలోని ఉప్పరపల్లి, మోర్ఖండి వెళ్లే రోడ్డు. ఇటీవల వర్షాలకు రోడ్డు తెగిపోవడంతో ఆ గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం మరమ్మతులు చేసేందుకు   నిధులు విడుదలకు చేయకపోవడంతో వర్షాలు తగ్గిన రోడ్డు మాత్రం అలాగే ఉండిపోయింది. మరమ్మతులు చేయించాలని కోరుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. జిల్లాలోని చాలా రోడ్ల పరిస్థితి ఇలాగే ఉంది.  

రూ.400 కోట్లు అవసరం...

జిల్లాలో దెబ్బతిన్న రోడ్లు , వంతెనల శాశ్వత రిపేర్ల కోసం   దాదాపు రూ. 400 కోట్లు అవసరం ఉంటాయని అంచనా వేస్తున్నారు.  తాత్కాలిక  రిపేర్లకే   రూ.15 కోట్ల నుంచి 20 కోట్లు కావాలి.  జిల్లాలో 42 ఆర్అండ్బీ రోడ్లు, వంతెనలు 27   దెబ్బతినగా తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.2 కోట్లు శాశ్వత రిపేర్ల కోసం  రూ.152 కోట్లు అవసరమని, పంచాయతీ రాజ్ కు సంబంధించి 105 చోట్ల రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. వీటికి తాత్కాలిక మరమ్మత్తుల కోసం రూ. 10 కోట్లు శాశ్వత పరిష్కారం కోసం రూ.250 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారు.  

నిత్యం నరకం అనుభవిస్తున్నం

భారీ వర్షాల కారణంగా మా గ్రామానికి వెళ్లే రోడ్డు అధ్వాన్నంగా ఉంది. ఎవ్వరు పట్టించుకోకపోవడంతో మరమ్మతులు కూడా చేయడం లేదు. రోడ్డుపై ఏర్పడిన గుంతలతో వాహనాలు నడపాలంటేనే ఎక్కడపడిపోతామని భయపడుతున్నాం. 

- కానిందే జగదీశ్వర్, మొర్కండి గ్రామం.

మరమ్మతులు చేస్తున్నాం..

జిల్లాలో పంచాయతీ రాజ్ పరిధిలో వచ్చే రోడ్లు బ్రిడ్జిలు 105 వరకు దెబ్బ తిన్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల రోడ్ల కు తాత్కాలికంగా మరమ్మతులు చేస్తున్నాం. శాశ్వత పరిష్కారం కోసం రూ.250 కోట్ల అవసరం కాగా ప్రభుత్వానికి నివేదిక అందజేశాం. నిధులు వస్తే పనులు చేపడతాం. 

- మహావీర్, పంచాయతీ రాజ్ ఈఈ , ఆదిలాబాద్.