ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండి

ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండి
  • మంత్రి ఉత్తమ్​కు ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్యే హరీశ్​బాబు వినతి

హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను చేపట్టాలని, ప్రాణహిత, కుప్టి ప్రాజెక్టులను పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్సీ కోదండరాం, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు, తెలంగాణ జలసాధనసమితి కన్వీనర్ నైనాల గోవర్ధన్, ప్రాణహిత పరిరక్షణ వేదిక కన్వీనర్ కేవీ ప్రతాప్ కోరారు. గురువారం హైదరాబాద్ లోని జలసౌధలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ ను కలిసిన వారు ప్రాజెక్టులపై చర్చించి, వినతిపత్రం అందించారు. 

కుంగిపోయిన మేడిగడ్డకు ప్రత్యామ్నాయంగా, ప్రాణహిత తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు యుద్ధ ప్రాతిపాదికన నిధులు కేటాయించి పనులు చేపట్టాలని మంత్రిని కోరారు. ‘‘గతంలో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం అనేక సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించింది. అవి కుంమ్రం భీమ్ ప్రాజెక్టు, జగన్నాథ్ పూర్ ప్రాజెక్టు, గొల్ల వాగు ప్రాజెక్టు, నీల్వాయి ప్రాజెక్టు, న్యూ సదర్ మట్ బ్యారేజీలు ఇంకా పూర్తి కాలేదు. కొద్దిపాటి నిధుల కేటాయింపుతో, ఈ ప్రాజెక్టుల పెండింగ్​పనులన్నీ పూర్తి చేసి, సాగునీరు అందించవచ్చు. డీపీఆర్ పూర్తి అయిన కుప్టి, శంకుస్థాపన చేసిన ప్రాణహిత–తుమ్మిడి హెట్టి ప్రాజెక్టులు నిధుల కేటాయింపు లేక మొదలవలేదు” అని వారు ఉత్తమ్​కు వివరించారు.