ఆదిలాబాద్ ​జిల్లాలో అట్టహాసంగా పోలీసుల వార్షిక క్రీడలు

ఆదిలాబాద్ ​టౌన్, వెలుగు: ఆదిలాబాద్ ​జిల్లా పోలీసుల వార్షిక క్రీడలు గురువారం స్థానిక పోలీస్​హెడ్​ క్వార్టర్స్​ గ్రౌండ్​లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎస్పీ గౌస్ ఆలంతో కలిసి కలెక్టర్ రాజర్షి షా క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. పోటీలను మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. క్రీడల ద్వారా మానసిక, శారీరక దృఢత్వాన్ని పొందవచ్చని, ప్రతి ఒక్కరూ క్రీడా స్పూర్తిని కలిగి ఉండాలన్నారు. ప్రతినిత్యం విధుల్లో నిమగ్నమయ్యే పోలీసులకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు. అడిషనల్​ఎస్పీ బి.సురేందర్​రావు, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్.జీవన్ రెడ్డి, హసీబుల్లా, రిజర్వ్ ఇన్​స్పెక్టర్లు, ఇన్​స్పెక్టర్లు, ఎస్సైలు, జిల్లా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఆసిఫాబాద్​లో..

ఆసిఫాబాద్, వెలుగు: క్రీడలతో స్నేహపూరిత సంబంధాలు మెరుగుపడుతాయని ఆసిఫాబాద్ ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా పోలీస్ యాన్యువల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్​ను ఏఆర్ హెడ్ క్వార్టర్స్​లో ప్రారంభించారు. ఎస్పీ  మాట్లాడుతూ.. పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా ఉంటారని, క్రీడల్లో పాల్గొనడం ద్వారా నూతనోత్సాహం లభిస్తుందన్నారు. ప్రతిభ కనబరిచిన వారిని కరీంనగర్​లో జరిగే స్టేట్ లెవల్ స్పోర్ట్ మీట్ కు ఎంపిక చేస్తామని తెలిపారు.