వెంకటేశ్ నేత క్షమాపణ చెప్పాలి : కొప్పుల రమేశ్

వెంకటేశ్ నేత క్షమాపణ చెప్పాలి : కొప్పుల రమేశ్

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వెంకటేశ్ నేత వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాల సంక్షేమ సంఘం ఆదిలాబాద్​ జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేశ్ డిమాండ్ ​చేశారు. సోమవారం స్థానిక ప్రెస్​క్లబ్​లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వెంకటేశ్ నేత చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై వ్యక్తిగత విమర్శలకు పాల్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వివేక్ వెంకటస్వామిని ఆయన మాలలసింహ గర్జన, మాలల జనాభాను అడ్డుపెట్టుకొని ఎస్సీ వర్గీకరణను స్వప్రయోజనాల కోసం అడ్డుకుంటున్నారని అనడం సరికాదన్నారు. 

దళితుల ఐక్యత కోసం వివేక్​ వెంకటస్వామి తండ్రి దివంగత గడ్డం వెంకటస్వామి దశాబ్దాలుగా కృషి చేశారని గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నష్టం కలిగించే ఈబీసీ రిజర్వేషన్ గురించి, జీవో నంబర్ 29 గురించి ఏనాడూ మాట్లాడని వెంకటేశ్ నేత, మందకృష్ణ మాదిగ.. ఈరోజు ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఇకనైనా తీరుమార్చుకోవాలని, లేదంటే తగిన రీతిలో బుద్ధిచెబుతామని హెచ్చరించారు. సమావేశంలో సంఘం నాయకులు మేకల మల్లన్న, ఎ.సుధీర్, పి.రాఘవేంద్ర, ఎస్.​అశోక్, ఎం.స్వామి, బి.భూమన్న, వి.నర్సింలు తదితరులు పాల్గొన్నారు.