బ్రిడ్జిల నిర్మాణం పూర్తయ్యేదెప్పుడో?

బ్రిడ్జిల నిర్మాణం పూర్తయ్యేదెప్పుడో?
  • ఆగిన రైల్వే అండర్, ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు
  • కేంద్ర, రాష్టాల వాటల కింద రూ. 97.20 కోట్లు మంజూరు
  • 8 నెలలుగా పనులు పిల్లర్ల వరకే పరిమితం.. భూసేకరణపై దృష్టి పెట్టని అధికారులు 

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల కోరిక రైల్వే అండర్, ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఆదిలోనే ఆగిపోయాయి. ప్రాజెక్టు పనులను హడావుడిగా ప్రారంభించి.. ఆ తర్వాత వదిలేశారు. ఏడాదిన్నరగా పనులు నత్తనడకన సాగుతుండ డంతో ప్రజలకు ప్రయాణ తిప్పలు తప్పడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ రెండు ప్రాజెక్టులను చేపట్టాయి. ఇందుకు మొత్తం రూ.రూ.97.20 కోట్లు మంజూరయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తాంసి బస్టాండ్ వద్ద అండర్ బ్రిడ్జి, స్పిన్నింగ్ మిల్లు ప్రాంతంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు రాష్ట్ర సర్కార్ 2023 జనవరిలో పరిపాలన అనుమతులిచ్చింది.

 అయితే మొదట రూ.27 కోట్లతో టెండర్లు పిలువగా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దాదాపు నాలుగు సార్లు టెండర్లు ఆహ్వానించినా ఒక్కరు కూడా రాకపోవడంతో రూ.30 కోట్లకు అంచనాలు పెంచి ఐదోసారి ఆహ్వానించడంతో హైదరాబాద్ కు చెందిన ఓ కంపెనీ టెండర్లు దక్కించుకుంది. 2023 మేలో పనులు ప్రారంభించి 2024 నవంబర్ లో పూర్తి చేయాల్సి ఉంది. అయితే సదరు కాంట్రాక్టర్ పనులు ప్రారంభించి పిల్లర్ల వరకు నిర్మాణం చేపట్టారు. కానీ పలు కారణాలలో పనులను మధ్యలోనే ఆపేశారు.

సర్వే చేసి వదిలేసిండ్రు..

రైల్వే అండర్ బ్రిడ్జి, ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించి స్థల సేకరణ కోసం అధికారులు గతంలోనే సర్వే చేశారు. అయితే సర్వే పూర్తి చేసినప్పటికీ ఇప్పటి వరకు కొంచెం భూమిని కూడా సేకరించలేదు. దీంతో పనులు చేసేందుకు స్థల సేకరణ అడ్డురావడంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. తాంసి బస్టాండ్‌ నుంచి పంజాబ్‌ చౌక్‌ వరకు నిర్మాణం వెడల్పు 12.40 మీటర్లు, బీటీ రోడ్డు కోసం 7.50 మీటర్లు స్థలాన్ని సర్వే చేసి గుర్తించారు. ఇక స్పిన్నింగ్‌ మిల్లు వద్ద నిర్మించే బ్రిడ్జి కోసం 11.80 మీటర్ల వెడల్పు, బీటీ రోడ్డు కోసం 14 మీటర్లు, ఇరువైపులా డ్రైనేజీల నిర్మాణానికి గానూ మరో 7 మీటర్ల స్థల సేకరణ చేపట్టాల్సి ఉంది. కానీ అందుకోసం అధికారులు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ భూమి కావడంతో పిల్లర్లు నిర్మించిన కాంట్రాక్టర్.. స్థల సేకరణలో ఆలస్యమవుతుండడంతో మిగతా పనులు చేసేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. 

తీరని కష్టాలు

రైల్వే ఓవర్, అండర్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే ఆదిలాబాద్ పట్టణం అభివృద్ధి చెందే ఆస్కారం ఉంటుంది. ప్రజలకు ప్రయాణ భారం కూడా తగ్గుతుంది. ఆదిలాబాద్‌ పట్టణ వాసులు, తాంసి, తలమడుగు మండలాల్లోని గ్రామాలకు చెందిన ప్రజలు ఆదిలాబాద్‌కు రావాలంటే తాంసి బస్టాండ్ వద్ద ఉన్న రైల్వే ట్రాక్‌ దాటక తప్పడం లేదు. తాంసి బస్టాండ్‌ తోపాటు స్పిన్నింగ్‌ మిల్‌ ప్రాంతంలో రైల్వే ట్రాక్‌లు ఉండడంతో రైళ్ల రాకపోకల సమయంలో ఇబ్బందులు పడుతున్నారు.

 రైళ్లు వచ్చే సమయంలో గేట్లు మూసివేయ డంతో పట్టణంలోని ఖుర్షిద్‌నగర్‌, సందరయ్య నగర్‌, గాంధీనగర్‌, తాటిగూడ రణదేవ నగర్‌, హమాలీవాడ, భాగ్యనగర్‌, క్రాంతినగర్‌, జై జవాన్‌ నగర్‌ ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు అవస్థలు పడుతున్నారు. రైలు వచ్చే సమయాల్లో గేట్లు వేయడంతో పట్టాలకు ఇరువైపులా వాహనాలు కిలోమీటర్ మేర నిలిచిపోయి అవస్థలు పడుతున్నారు. పత్తి మార్కెట్​కు వచ్చే సమయంలో రైతుల పత్తి బండ్లు ఒక వైపు.. మరోవైపు నిత్యం వేధించే ట్రాఫిక్​తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.