ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

  • నిర్మల్​ శివారు గ్రామాల విలీనంతో మారనున్న పట్టణ రూపురేఖలు

నిర్మల్​,వెలుగు: నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో కొత్త మాస్టర్ ప్లాన్​ను మున్సిపల్ శాఖ పచ్చజెండా ఊపింది. కొన్ని రోజుల క్రితం మున్సిపల్ ​ఆఫీసర్లు మాస్టర్ ప్లాన్ సవరణ కోసం సర్వే నిర్వహించారు. నివేదికను మున్సిపల్ శాఖకు అందించారు. దీనిపై పూర్తిస్థాయి కసరత్తు చేసిన మున్సిపల్ శాఖ మాస్టర్ ప్లాన్ సవరణకు అంగీకరించారు. పట్టణం రోజురోజుకు వేగంగా విస్తరిస్తోంది. శివారులోని మంజులాపూర్, వెంకటాపూర్  ఇటీవల మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. గత మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రస్తుత ఉన్న అనేక నివాస ప్రాంతాలు ఇండస్ట్రియల్, కమర్షియల్ జోన్ ల పరిధిలో ఉన్నాయి. దీంతో  ఈ ఏరియాల్లో ఇండ్లు నిర్మించాలంటే పర్మిషన్లు దొరకడంలేదు. డీటీసీపీ అనుమతి లేకుండా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు కొనసాగడంతో చాలామంది అవగాహన రాహిత్యంతో ఇండస్ట్రియల్, కమర్షియల్ జోన్లలో ప్లాట్లు కొనుగోలు చేశారు. టీఎస్​బీపాస్​అమలవుతుండడంతో డస్ట్రియల్, కమర్షియల్ జోన్ల పరిధిలోని ప్లాట్లలో ఇల్లు నిర్మించడం సాధ్యం కాలేదు. బ్యాంకులు లోన్లు ఇవ్వడానికి ముందుకు రాలేదు. దీంతో  మాస్టర్ ప్లాన్ ను  సవరించాలంటూ మున్సిపల్ పాలకవర్గం  పలుసార్లు తీర్మానించింది. స్పందించిన ప్రభుత్వం ఎట్టకే లకు మాస్టర్ ప్లాన్ సవరణకు అనుమతి ఇవ్వడంతో సమస్యలన్నీ తీరనున్నాయి.

హిందూ సేవక్​ సమాజ్ ఆధ్వర్యంలో పాలి క్లినిక్​ ఏర్పాటు 

మంచిర్యాల, వెలుగు: పేదలకు అతి తక్కువ ఖర్చుతో మెరుగైన సేవలందించేందుకు హిందూ సేవక్ సమాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కాంప్లెక్స్​లో పాలిక్లినిక్​ ఏర్పాటు చేశారు. పద్మశ్రీ గ్రహీత, ప్రముఖ  కార్డియో థోరాసిక్ సర్జన్ దాసరి ప్రసాదరావు, అడిషనల్​ కలెక్టర్ బి.రాహుల్, డీసీపీ అఖిల్ మహాజన్​ శుక్రవారం పాలిక్లినిక్​ప్రారంభించారు.​ పేదల కోసం హిందూ సేవక్ సమాజ్ చేస్తున్న సేవలు అభినందనీయమని ప్రసాదరావు చెప్పారు. రెండేండ్లుగా మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీల పరిధిలో ఫ్రీ అంబులెన్స్ సేవలు అందిస్తోందన్నారు. ఐదు నెలలుగా క్లినికల్ ల్యాబ్ ఏర్పాటు చేసి రక్త, మూత్ర పరీక్షలు చేస్తూ  ఎంతో మందికి అండగా నిలుస్తోందన్నారు. తాజాగా పాలిక్లినిక్​ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గుండె, నరాలు, కిడ్నీ, మూత్రపిండాలు ఇతర వైద్య నిపుణులు క్లినిక్​లో సేవలందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రమణ, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్​రావు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గుండా సుధాకర్, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, హిందూ సేవక్ సమాజ్ వ్యవస్థాపక అధ్యక్షుడు జగన్, డైరెక్టర్లు చక్రాల పూర్ణచందర్, విజయభాస్కరరావు, శ్రీధర్ పాల్గొన్నారు.

11వ వేజ్​బోర్డు అమలు చేయాలి

మందమర్రి/నస్పూర్/బెల్లంపల్లి/ఆసిఫాబాద్,వెలుగు: బొగ్గు గని కార్మికుల 11వ వేజ్​ బోర్డు వెంటనే అమలు చేయాలని,  బొగ్గు బ్లాక్​లను ప్రైవేటీకరణను నిరసిస్తూ సింగరేణి బొగ్గు గనులు, డిపార్ట్​ మెంట్లపై శుక్రవారం కార్మిక సంఘాలు ఆందోళన నిర్వహించాయి. మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాల్లోని అండర్​గ్రౌండ్​, ఓపెన్​కాస్ట్​  బొగ్గుగనులు, డిపార్ట్​మెంట్లపై కార్మికులు నిరసన వ్యక్తం చేశారు.  శ్రీరాంపూర్  ఏరియా జీఎం ఆఫీస్ ఎదుట బీఎంఎస్​ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. 

‘అబ్​కి బార్​ కిసాన్ ​సర్కార్’

నిర్మల్,వెలుగు: దేశంలో 70 శాతం మంది వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నారని, వారి కన్నీళ్లు తుడువడం కోసమే ‘అబ్ కి బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో బీఆర్ఎస్​ఆవిర్భవించిందని మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. గురువారం మంత్రి స్థానికంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలతో రైతన్నలు ఆర్థికంగా బలపడ్డారని, తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలుకావాలన్న ఆశయంతో కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు చేశారన్నారు. హరితహారంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. 20 ఏళ్ల క్రితం కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన టీఆర్ఎస్ ఇప్పుడు లక్ష్యాన్ని పూర్తి చేసిందన్నారు. జాతీయ రాజకీయాల్లో నూతన శకం ప్రారంభం కానుందన్నారు. ప్రజలంతా బీఆర్ఎస్ ను ఆశీర్వదించాలన్నారు.

కాంగ్రెస్​తోనే సామాజిక తెలంగాణ

నిర్మల్,వెలుగు: తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన గొప్ప నాయకురాలు సోనియాగాంధీ అని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన తన నివాసంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సామాజిక తెలంగాణ కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయమన్నారు. టీఆర్ఎస్, బీజేపీలకు ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తక్కల రమణారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ ఇమ్రాన్ ఉల్లా, లీడర్లు ముత్యంరెడ్డి, అయ్యన్నగారి పోశెట్టి, నాందేడపు చిన్ను, జమాల్, కూన శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.