ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

బెల్లంపల్లి రూరల్, వెలుగు: భీమిని మండల సమస్యలు పరిష్కరించని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ అసెంబ్లీ ఇన్​చార్జి కొయ్యల ఏమాజీ డిమాండ్​చేశారు. బుధవారం ఆయన స్థానికంగా నిర్వహించిన పార్టీ మండల కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. లక్ష్మీపూర్, ఖర్జీ భీంపూర్, కేస్లాపూర్, చిన్నగుడిపేట, పెద్దగుడిపేట గ్రామాల్లో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్​చేశారు. తప్పుడు డెత్​సర్టిఫికెట్​జారీచేసి భూ ఆక్రమణకు సహకరించిన చిన్నగుడిపేట పంచాయతీ కార్యదర్శి రమణను సస్పెండ్​ చేయాలన్నారు. అనంతరం ఎంపీవో సబ్దర్​అలీకి వినతిపత్రం అందజేశారు. పార్టీ మండల అధ్యక్షుడు భీమయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి గోవర్దన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కేశవరెడ్డి, మండల అధ్యక్షుడు భీమయ్య, ప్రకాశ్​ తదితరులు పాల్గొన్నారు.   

అభివృద్ధిని పట్టించుకోని పాలకులు

బెల్లంపల్లి,వెలుగు: పాలకులు పట్టించుకోకపోవడం వల్లే నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని సీపీఐ నియోజకవర్గ ఇన్​చార్జి రేగుంట చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం ఆయన స్థానికంగా మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకే ఇండ్ల పట్టాలు ఇస్తామని చెబుతున్నారని విమర్శించారు. స్థానికంగా వందపడకల ఏరియా హాస్పిటల్​నిర్మించి వదిలేశారన్నారు. వేమనపల్లి , భీమిని, కన్నెపల్లి, కాసిపేట మండలాల్లో సరైన రోడ్డు లేదన్నారు. ఇండ్లు లేని పేదలకు రూ.3 లక్షలు ఇస్తామనడం కాని, సొంత స్థలాలు ఉన్న పేదలకు రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్​చేశారు. సీపీఐ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 40 అసెంబ్లీ  స్థానాలకుపైగా పోటీ చేస్తుందన్నారు. పొత్తు ఉన్నా... లేకున్నా బెల్లంపల్లిలో రంగంలో ఉంటామన్నారు. ఈ నెల 18న నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సీపీఐ టౌన్ సెక్రటరీ దాసరి శ్రీధర్, జిల్లా సమితి సభ్యుడు బొంతల లక్ష్మీనారాయణ, ఎల్తూరి శంకర్, బొంకూరి రాంచందర్, బియ్యాల ఉపేందర్, బి. తిలక్ అంబేద్కర్, గుండా చంద్ర మాణిక్యం, పోతుల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎన్డీఆర్ఎఫ్ సేవలు అభినందనీయం

నిర్మల్,వెలుగు: ప్రకృతి విపత్తుల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ సేవలు అభినందనీయమని అడిషనల్ కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు పేర్కొన్నారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఆధ్వర్యంలో ఎన్​సీసీ యూనిట్ అగ్నిమాపక దళం ఆధ్వర్యంలో బుధవారం అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా విపత్తులను ఎదుర్కొనే పద్ధతులు వివరించారు. సీపీఆర్ లాంటి పద్ధతుల ద్వారా ప్రజల ప్రాణాలు ఎలా కాపాడవచ్చో ప్రత్యక్షంగా చూపించారు. అంతర్జాతీయ స్థాయిలో ఎన్​డీఆర్​ఎఫ్ కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. కార్యక్ర మంలో డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ భీమారావు, ఆర్డీవో స్రవంతి, తహసీల్దార్​సుభాష్, ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ దామోదర్ సింగ్, గోపాల్ మీనా, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలె

మందమర్రి, వెలుగు: అర్హులైన పేదలకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్​ చేస్తూ బుధవారం స్థానిక తహసీల్దార్​ఆఫీస్​ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా  టీడీపీ పార్లమెంట్ ప్రెసిడెంట్ బి. సంజయ్ కుమార్ మాట్లాడుతూ ... టీఆర్ఎస్ సర్కార్​ ఎనిమిదేళ్ల పాలనలో ఇప్పటివరకు ఒక్క డబుల్​ బెడ్​రూమ్ ​ఇల్లు ఇవ్వలేదన్నారు. అర్హులైన పేదలు వేల సంఖ్యలో ఉంటే వందల సంఖ్యలో ఇండ్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇండ్ల కోసం  టీఆర్ఎస్​ లీడర్లు లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. సర్కార్​ ఇండ్లను కేటాయించకపోతే వచ్చేనెల 5న తామే అర్హులైన పేదలకు డబుల్​ బెడ్​రూమ్ ​ఇండ్లు పంపిణీ చేస్తామన్నారు. నిరసనలో తెలుగు మహిళ రాష్ట్ర కార్యదర్శి  షరీఫా, లీడర్లు  మాధవరావు, మెంగాని రామస్వామి, అనంతలక్ష్మి, సంధ్య, స్వామి, జలీల్, శేఖర్ లక్ష్మి, ఇందిర, శశి, రజిత తదితరులు పాల్గొన్నారు.

ఆధ్యాత్మికతతోనే ప్రశాంతత

నిర్మల్,వెలుగు: ఆధ్యాత్మికతతో మనిషికి ప్రశాంతత లభిస్తుందని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.  బుధవారం స్థానిక బోయివాడలోని అడెల్లి పోచమ్మను దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేవాలయాలు భక్తిని పెంపొందిస్తాయన్నారు. కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ ముత్యంరెడ్డి, కాంగ్రెస్ బీసీ సెల్ లీడర్​జింక సూరి, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ నాందేడపు చిన్ను పాల్గొన్నారు.

‘అంగన్​వాడీ జాగా కబ్జా అవాస్తవం’

ఖానాపూర్,వెలుగు: ఖానాపూర్ విద్యానగర్ అంగన్ వాడీ సెంటర్ ఎదుట గల స్థలం కబ్జాకు గురైందని గత కొద్ది రోజుల నుంచి వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని బాధితుడు అబ్దుల్ రహీం పేర్కొన్నారు. బుధ వారం స్థానికంగా మీడియాతో మాట్లాడారు.1992లో సర్వే నంబర్ 178లో తాను ప్లాట్​కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ఎలాంటి విచారణ చేయకుండా మున్సిపల్ ఆఫీసర్లు నోటీసులు జారీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. కొనుగోలు చేసిన ప్లాట్​ను కబ్జా చేశారని ఆరోపించడం సరికాదన్నారు.

ఘనంగా మహాలక్ష్మి ఉత్సవాలు

నిర్మల్,వెలుగు: నిర్మల్​లోని బంగల్ పేట్ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ  ప్రతిష్ఠాపన ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బుధవారం నిర్వహించిన కుంకుమార్చన, యజ్ఞంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గురువారం వేకువ జామున మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. ఉత్సవాలకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జడ్పీ చైర్​పర్సన్​కొరిపల్లి విజయలక్ష్మి తదితరులు  హాజరు కానున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ కొడుకుల గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, కౌన్సిలర్లు బిట్లుంగు నవీన్, ఆదుముల రమా పద్మాకర్, కో ఆప్షన్ సభ్యుడు చిలుక గోవర్దన్ తదితరులు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ సందర్భంగా జరిగే సమావేశాన్ని ఉద్దేశించి మంత్రి ప్రసంగించనున్నారు.