ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ పార్లమెంట్​పరిధిలో సీసీఐ పత్తి కొనుగోలు పారదర్శకంగా చేపట్టాలని ఎంపీ సోయం బాపూరావు కోరారు. బుధవారం ముంబైలో సీసీఐ సీఎండీ ప్రదీప్ అగర్వాల్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పత్తి కొనుగోలు, మద్దతు ధర, కొనుగోలుపై చర్చించారు. రైతులను అకాల వర్షాలు వెంటాడుతున్నాయని.. పత్తిలో తేమ శాతం పెరగడంతో 8 నుంచి 12 వరకు తేమశాతం నిబంధనలను సడలించి గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. కొనుగోలు కేంద్రాలను ఏజెన్సీ ప్రాంతాలకు విస్తరించి రైతులకు దూరభారాన్ని తగ్గించాలన్నారు. 

ఉత్సాహంగా 5కే రన్​

కాగజ్ నగర్,వెలుగు: పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా బుధవారం కాగజ్ నగర్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో 5 కే రన్​ నిర్వహించారు. స్థానిక ఎస్పీఎం గ్రౌండ్ లో ఎస్పీ సురేశ్​కుమార్ జెండా ఊపి రన్​ప్రారంభించారు. సుమారు పన్నెండు వందల మంది రన్నింగ్ లో పాల్గొన్నారు. జిల్లాలోని పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు హాజరయ్యారు. కాగజ్ నగర్ కు చెందిన 60 ఏళ్ల వెటరన్​ వైరగడే ఆనంద్ రావు 28 నిమిషాల్లో రన్ పూర్తి చేసి ఆకట్టుకున్నాడు. విజేతలకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్​ఎస్పీలు అచ్చేశ్వరరావు, ఏఈఆర్​భీంరావు, జడ్పీ వైస్​చైర్మన్​కోనేరు కృష్ణారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ గిరీష్ కుమార్, 
డీఎస్పీలు శ్రీనివాస్, కరుణాకర్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

మీటింగ్​లకు ఆఫీసర్లు ఎందుకురారు?

ఇచ్చోడ,వెలుగు: ప్రజా సమస్యలపై చర్చించడం.. పరిష్కార మార్గాలు చూపడం కోసం మూడు నెలలకోసారి నిర్వహించే మండల సమావేశానికి ఆఫీర్లు ఎందుకు రారని ఎంపీపీ నిమ్మల ప్రీతం రెడ్డి ఫైర్​అయ్యారు. బుధవారం ఎంపీపీ ప్రీతంరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి వివిధ శాఖల అధికారులు రాకపోవడంపై ఆయన మండిపడ్డారు. మొత్తం 23 శాఖలకు చెందిన అధికారులు హాజరు కావాల్సి ఉండగా 12 మంది ఆఫీసర్లే వచ్చారన్నారు. పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు కూడా రాలేదన్నారు. ఇలాంటి ప్రజాప్రతినిధులు స్థానిక సమస్యలు ఎలా పరిష్కరిస్తారని ఆయన ప్రశ్నించారు. హాజరైన కొందరు ప్రజాప్రతినిధులు వివిధ సమస్యలు ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లగా ఫండ్స్​లేకపోవడంతో సమస్య వస్తోందని సమాధానం ఇచ్చారు. ‘ఇండ్లు అమ్మి పనులు చేయాలా’ అని ఎదురు ప్రశ్నించారు. ఇప్పటికే మూడు నెలలుగా పంచాయతీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన ఫండ్​ ఇంకా ఇవ్వలేదన్నారు. దీంతో పారిశుద్ధ్య కార్మికులకూ జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. సమావేశంలో జడ్పీటీసీ సభ్యురాలు సుభద్రబాయి , ఎంపీడీవో రాంప్రసాద్, డీటీ రామారావు తదితరులు ఉన్నారు .

పేద విద్యార్థులకు అండగా వెరబెల్లి ట్రస్ట్

దండేపల్లి, వెలుగు: పేద విద్యార్థులకు అండగా వెరబెల్లి ట్రస్ట్ ఉంటుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు చెప్పారు. బుధవారం లక్సెట్టిపేట మున్సిపల్ ఇటిక్యాల గవర్నమెంట్​ స్కూల్​లో10వ తరగతి చదువుతున్న స్కూల్ బ్యాగులు, బుక్స్ అందజేశారు. విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రోత్సహించడమే తమ ఫౌండేషన్ లక్ష్యంమని తెలిపారు. 10లో జీపీఏ సాధిస్తే ఉచితంగా ఇంటర్మీడియెట్ చదివిస్తానని హామీ ఇచ్చారు. టౌన్​ ప్రెసిడెంట్​ వీరమళ్ల హరిగోపాల్, ప్రధాన కార్యదర్శి ఎనగందుల లక్ష్మణ్, గుండా ప్రభాకర్, బుద్దె లక్ష్మణ్​, వేముల మధుకర్, ముష్కం గంగన్న, నాగిరెడ్డి హేమంత్​రెడ్డి, ఎగ్గడి నాగరాజు, మోటపలుకుల సతీష్ పాల్గొన్నారు.

అనర్హులకు దళిత బంధు ఇస్తున్నారు

లోకేశ్వరం,వెలుగు: అనర్హులకు దళిత బంధు ఇస్తున్నారని పలువురు మహిళలు ఎమ్మెల్యే విఠల్​రెడ్డిని నిలదీశారు. బుధవారం లోకేశ్వరంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేతో మాట్లాడారు. అనర్హులకు ఇచ్చేలా స్థానిక లీడర్లు పైరవీలు చేస్తున్నారని మండిపడ్డారు. 

కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ..

లోకేశ్వరంలో పలువురికి మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులను ఎమ్మెల్యే విఠల్​రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల అభివృద్ధి కోసం కృషిచేస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, తహసీల్దార్ సరిత, ఎంపీపీ లలిత భోజన్న, టీఆర్ఎస్​మండల కన్వీనర్ కరిపె శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.

రోహిత్​ను చంపిన వారిని శిక్షించాలి

నార్నూర్,వెలుగు: గిరిజన విద్యార్థి రాథోడ్ రోహిత్ ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, రూ. 25 లక్షల ఎక్స్​గ్రేషియా ఇవ్వాలని విద్యార్థి సంఘాలు డిమాండ్​చేశారు. బుధవారం మండల కేంద్రంలోని గాంధీచౌక్​ వద్ద ధర్నా నిర్వహించారు. న్యాయం చేయని పక్షంలో ఆదిలాబాద్  నుంచి హైదరాబాద్​వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. ఆందోళలో ఉట్నూర్ జడ్పీటీసీ రాథోడ్ చారులత, బీజేపీ సీనియర్​ లీడర్​రెడ్డి నాయక్, పీఏసీఎస్​ఇన్​చార్జి చైర్మన్​ఆడె సురేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తొడసం నాగోరావు, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు యూర్వేత రుపదేవ్ తదితరులు పాల్గొన్నారు.

రాజాసింగ్​ను విడుదల చేయాలి

బెల్లంపల్లి, వెలుగు : గోషామహాల్ ​ఎమ్మెల్యే రాజాసింగ్ ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్​ చేస్తూ బుధవారం రాత్రి హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బీజేపీ లీడర్లు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జి కొయ్యల ఏమాజీ. జాయింట్ కన్వీనర్ రాజులాల్ యాదవ్, జిల్లా కార్యదర్శి కోయిల్కర్ గోవర్దన్, లీడర్లు అజ్మీరా శ్రీనివాస్, శనిగరపు శ్రావణ, కల్లేపల్లి నవీన్, ఎరుకల నర్సింగ్, కమల్ లాహోటి, శ్రీనివాస్, శైలేందర్​ సింగ్, మోహన్ కాంత్, రంగు కుమార్, భువనేశ్వర్, గండ్ల మహేశ్​ తదితరులు పాల్గొన్నారు.  

ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్తున్నారు

కాగజ్ నగర్,వెలుగు : అందవెల్లి బ్రిడ్జి ఏడాదిగా కూలిపోయేందుకు రెడీగా ఉంటే ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్​కొత్తపల్లి శ్రీనివాస్​ఫైర్​అయ్యారు. ప్రజలు ప్రమాదకరంగా నాటుపడవల్లో ప్రయాణిస్తున్నారని.. అభివృద్ధి అంటే ఇదేనా అని ప్రశ్నించారు. బుధవారం ఆయన అందవెల్లి పెద్దవాగు బ్రిడ్జి కూలిన ప్రదేశాన్ని పరిశీలించారు. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తెప్పలపై వెళ్తున్నారని, జరగరానిది జరిగితే ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, కలెక్టర్​రాహుల్​రాజ్​బాధ్యత వహించాలన్నారు. ఆయన వెంట ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు పార్వతి శంకర్, లీడర్లు  ధోని శ్రీశైలం, చున్కపురి గణపతి తదితరులు పాల్గొన్నారు.