డబ్బులు ఇవ్వడం లేదని ఇంటికి తాళం

ఇచ్చోడ, వెలుగు : ఆదిలాబాద్ ​జిల్లా ఇచ్చోడ మండలం  సిరిచెల్మ గ్రామంలో  తీసుకున్న డబ్బులు ఇవ్వలేదని సర్పంచ్​ భర్త  ఓ వ్యక్తి ఇంటికి తాళం వేయించాడు.  దీంతో బాధిత కుటుంబం రాత్రంతా ఇంటి బయటే ఉంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి  చెందిన తట్ర శ్రీను అదే గ్రామానికి చెందిన రాజేందర్ వద్ద జీతం ఉండేందుకు ఒప్పుకొన్నాడు.  రూ.30 వేలు ముందుగా తీసుకున్నాడు. కొన్ని రోజులుగా పనికి వెళ్లకపోవడంతో సోమవారం పంచాయితీ నిర్వహించారు. డబ్బులు త్వరలోనే ఇస్తానని చెప్పినా వినకుండా సర్పంచ్ భర్త కన్నమయ్య పంచాయతీ సిబ్బందితో ఇంటికి తాళం వేయించాడు.  దీంతో వారు బిక్కుబిక్కు మని రాత్రంతా జాగారం చేశారు.

 విషయం తెలుసుకున్న పోలీసులు మంగళవారం గ్రామానికి చేరుకొని ఇంటికి వేసిన తాళం తీయించారు. సర్పంచ్ భర్త కన్నమయ్యతో పాటు రాజేందర్ పై బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై నరేశ్ ​తెలిపారు.