- ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం
- పలు చోట్ల నిలిచిన రాకపోకలు
- స్వర్ణ గేట్లు ఎత్తడంతో నిర్మల్‌లో నీట మునిగిన జీఎన్ఆర్ కాలనీ
- ఇండ్లలోకి నీరు చేరి జనం పాట్లు
వెలుగు, ఆదిలాబాద్ నెట్వర్క్: కుండపోత వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలమైంది. ముఖ్యంగా నిర్మల్, మంచిర్యాల జిల్లాలో వర్షం దంచికొట్టింది. గ్రామీణ ప్రాంతాల్లోని అనేక వాగులు, చెరువులు పొంగి పొర్లడంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రాళ్లవాగు ఉప్పొంగడంతో మంచిర్యాలలోని పలు కాలనీల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. నీరు ఇండ్లలోకి చేరడంతో నిత్యావసర వస్తువులు తడిసిపోయాయి. భైంసాలోని లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది.
దీంతో పలు గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. సీతాగోంది, మన్నూర్, గుడిహత్నూర్‌లో ఇండ్లలోకి వరద నీరు చేరడంతో నిత్యావసర సరుకులు పాడయ్యాయి. దీంతో బాధితులు తమకు సరుకులు అందించి ఆదుకోవాలని మండల కార్యాలయానికి చేరుకొని వినతి పత్రం అందజేశారు. నిర్మల్ పట్టణంలోని జీఎన్ఆర్ కాలనీలోకి స్వర్ణ ప్రాజెక్టు వరద నీరు చేరడంతో కాలనీ వాసులందరినీ సమీప ఆల్ఫోర్స్ స్కూల్‌కు తరలించి ఆశ్రయం కల్పించారు.
గడ్డెన్న వాగు ప్రాజెక్టులోకి భారీగా వరద..
భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టులోకి భారీగా వరదవచ్చి చేరడంతో అధికారులు ఏడు గేట్లను ఎత్తివేసి 1,11,8582 క్యూసెక్కుల నీటిని వదిలేశారు. మండలంలోని సిరాల ప్రాజెక్టుకు భారీగా వరద రావడంతో ప్రాజెక్టు కట్టకు గండి పడింది. ప్రమాదాన్ని పసిగట్టిన గ్రామస్తులంతా హుటాహుటిన సమీపంలోని గుట్ట పైకి చేరుకొని అక్కడి మహాదేవ్ మందిరంలో ఆశ్రయం పొందుతున్నారు. మండలంలో పల్సికర్రంగారావు ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ కారణంగా గుండెగాం గ్రామం ముంపునకు గురైంది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. భైంసా-పార్డీ(బీ) మార్గంలో గుండెగాం వద్ద వంతెన పై నుంచి వరద ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
ALSO READ :వానల జోరు.. వాగుల హోరు..
మహగాం పాత గ్రామం ప్రాంతంలోని కాలనీ, బస్టాండ్ ప్రాంతంలోని ప్రభుత్వ స్కూల్ నీట మునిగిపోయాయి. బజార్ హత్నూర్ మండలంలోని ఉప్పర్ పల్లి గ్రామానికి చెందిన దుర్వ రాందాస్ అనే యువకుడు తన గ్రామానికి వెళ్లేందుకు ఉప్పొంగిన వాగు దాటుతూ కొట్టుకుపోయాడు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత చెట్టు కొమ్మలు పట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపాడు. గ్రామస్తులు అతడిని బయటకు తీసి కాపాడారు. గుడిహత్నూర్మండలంలోని లింగాపూర్ గ్రామ సమీపంలోని వాగు వంతెన వద్ద రోడ్డు కోతకు గురైంది. టాకీగూడ వద్ద సైతం వంతెన పూర్తిగా కొట్టుకుపోగా రాకపోకలు నిలిచి పోయాయి.