
ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: తమ ఖాతాలో జమైన డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ ఎస్బీఐలో రైతులు మంగళవారం అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. పట్టణంలోని పంజాబ్ చౌక్‌లోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్‌లో బైఠాయించి ఆందోళన చేశారు. గతేడాది పత్తి అమ్మగా వచ్చిన డబ్బులు బ్యాంక్ ఖాతాలో జమ అయినప్పటికీ, డబ్బులు ఇవ్వడం లేదని రైతులు వాపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మేనేజర్, రైతులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ తాంసి మండలం వడూర్ గ్రామానికి చెందిన జిల్లెల మోహన్ కు చెందిన రూ. లక్ష, ఆదిలాబాద్ రూరల్ మండలం యాపలగూడ గ్రామానికి చెందిన నల్ల విలాస్ కు రూ.76 వేలు, నక్కల జగదీశ్‌కు చెందిన రూ.2 లక్షలు గత ఏడాది పోస్టాఫీస్ ఖాతాలో జమ చేసినట్లు చెప్పారు. అప్పటి పోస్ట్ ఆఫీస్ మేనేజర్ విజయ్ జాదవ్ సైబర్ క్రైమ్ కు పాల్పడడంతో పోలీసులు కేసు నమోదు చేశారని, దీంతో రైతుల డబ్బులు ఢిల్లీ బ్యాంక్ లో హోల్డ్ లో ఉన్నాయని తెలిపారు. కొంతమంది రైతులకు కలెక్టర్ రాజర్షి షా జోక్యంతో డబ్బులు చెల్లించామన్నారు. సంబంధిత బ్యాంక్ అధికారులతో మాట్లాడామని, త్వరలో డబ్బులు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
ALSO READ | Velugu Exclusive: ఏపీ నీళ్ల దోపిడీ ఇంత దారుణమా.. పదేళ్లలో దోచుకున్న లెక్కలివే..