టేస్టీ..హెల్దీ.. మిల్లెట్ బిస్కెట్స్...ఆదిలాబాద్ జిల్లాలో తొలిసారిగా యూనిట్ ఏర్పాటు

టేస్టీ..హెల్దీ.. మిల్లెట్ బిస్కెట్స్...ఆదిలాబాద్ జిల్లాలో తొలిసారిగా యూనిట్ ఏర్పాటు
  • గిరిజన మహిళల ఆర్థికాభివృద్ధికి సర్కార్ సాయం
  • ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేయగా ప్రారంభించిన కలెక్టర్ 

ఆదిలాబాద్, వెలుగు:  ప్రస్తుతం బయట మార్కెట్ లో నేచురల్ ఫుడ్స్ దొరకడం కష్టంగా ఉంది. చాలావరకు ఆరోగ్యానికి హాని చేసేవే కన్పిస్తుంటాయి. ఇలాంటి క్రమంలో చిరుధాన్యాలతో బిస్కెట్లు తయారీ చేసే వ్యాపారానికి ఆదిలాబాద్ జిల్లా గిరిజన మహిళలు శ్రీకారం చుట్టారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అందునాయక్ తండా రోడ్ లో ఇంద్రాయి మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  గిరిజన మిల్లెట్ బిస్కెట్ యూనిట్ ను శుక్రవారం కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు.

సెర్ప్ ద్వారా రూ.3.50 లక్షలను మండల సమాఖ్యకు లోన్ గా అందించారు. స్టార్టప్ విలేజ్ ఎంటర్ ప్రైజెస్ స్కీమ్ కింద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తొలిసారి మిల్లె ట్ బిస్కెట్ల యూనిట్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందిపుచ్చుకొని వ్యాపారంలోకి అడుగు పెట్టారు ఇంద్రాయి మహిళా సమాఖ్య సభ్యులు.

సేంద్రియంగా పండించిన చిరు ధాన్యాలతో తయారు..

ఎలాంటి రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్ధతిలో పండించిన చిరుధాన్యాలతో మాత్రమే బిస్కెట్లు తయారు చేస్తున్నారు. రాగులు, జొన్నలు, కొర్రలు, సజ్జలు, బెల్లం, డ్రై ఫ్రుడ్స్ వంటివాటితో చేస్తుండగా..  మైదా పిండికి బదులు జొన్న పిండి, చక్కెరకు బదులు బెల్లం వాడుతున్నారు. యూనిట్ ప్రారంభానికి ముందు ఐదుగురు మహిళా సభ్యులకు రాజమండ్రికి చెందిన మిల్లెట్ బిస్కెట్ల యూనిట్ నిర్వాహకులు వారం రోజులు శిక్షణ ఇచ్చారు.

బిస్కెట్ల తయారీ కోసం మెషీన్లను వినియోగిస్తున్నారు. యూనిట్ ప్రారంభించిన రెండు రోజుల్లో మార్కెట్లో బిస్కెట్లకు డిమాండ్ పెరిగింది. చాలా మంది ఆర్డర్ చేసి తీసుకెళ్తున్నట్టు రూ. 19 వేల బిస్కెట్లు అమ్ముడుపోగా రూ. 8 వేలు లాభం వచ్చినట్లు యూనిట్ నిర్వాహకులు తెలిపారు.  

మరికొన్ని ప్రాంతాల్లో యూనిట్లు

 మిల్లెట్ యూనిట్ లో తయారైన బిస్కెట్లు టేస్టీగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. చిరుధాన్యాలతో తయారు చేయడంతో ప్రోటీన్స్ అందుతాయని, బిస్కెట్లు త్వరగా డైజేషన్ కూడా అవుతాయని, గర్భిణులు, చిన్నపిల్లలకు చాలా ఉపయోగంగా ఉంటాయని అంటున్నారు. మన కండ్ల ముందే బిస్కెట్లు తయారు చేస్తుండగా కొనుగోలుదారులకు కూడా నమ్మకం కలుగుతుందని మహిళ సంఘ సభ్యులు చెబుతున్నారు.

లోకల్ మార్కెట్ లో బాగా ప్రచారం చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. త్వరలో బోథ్, నేరడిగొండ, తలమడుగు వంటి పలు ప్రాంతాల్లో యూనిట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డీఆర్డీవో రవీందర్ రాథోడ్ తెలిపారు. మహిళ సమాఖ్యకు బిస్కెట్లను ప్యాకింగ్ మెషీన్, మార్కెటింగ్ చేసుకునే సదుపాయాలకు మరో రూ. 5 లక్షలు అందిస్తామని తెలిపారు.  

ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేశాం

ప్రభుత్వ సహకారంతో ఐదుగురు సభ్యులం కలిసి లోన్ తీసుకున్నాం. మిల్లెట్ బిస్కెట్లు తయారీ యూనిట్ ఏర్పాటు చేసుకున్నాం.  ప్రభుత్వం ఆర్థికంగా తోడ్పాటు అందించడం సంతోషంగా ఉంది.  మిల్లెట్ బిస్కెట్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి.– రావుత్ మనీషా, మహిళ సమాఖ్య సభ్యురాలు