బోథ్ అసెంబ్లీ రాజకీయం.. నగేశ్ దారెటు..?

  • బీఆర్ఎస్ బోథ్ అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎంపీ
  • పార్లమెంట్ టికెట్ విషయంలో ఎమ్మెల్యే సక్కు వైపే అధిష్టానం మొగ్గు

ఆదిలాబాద్, వెలుగు :  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకప్పుడు ఓ వెలుగువెలిగిన మాజీ ఎంపీ గొడం నగేశ్ ఇప్పుడు డైలమాలో పడ్డారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ టికెట్ ఆశించినప్పటికీ అధిష్టానం ఆయనకు మొండిచేయి చూపడంతో  పార్టీ మారాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాగైనా ఈ సారి బోథ్ నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేయాలని భావిస్తుండటంతోనే ఆయన బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధమవుతున్నట్లు అనుచరులు  చర్చించుకుంటున్నారు. 

అయితే పార్టీ మార్పు విషయంలో  నగేశ్ అచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. టికెట్ కేటాయింపు విషయంలోనూ ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న నగేశ్ బోథ్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశారు. అలాంటి నేతకే టికెట్​ రాకపోవడంతో నిరాశకు గురవుతున్నారు.  ఇప్పటికే బీఆర్ఎస్ ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు కన్ ఫాం చేయడంతో ఇక నగేశ్ రాజకీయ భవిష్యత్తుపై ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. 

టీడీపీ నుంచి బీఆర్ఎస్ లోకి..

నగేశ్ తన తండ్రి వారసుడిగా టీడీపీలో క్రియశీలంగా వ్యవహరించారు. ఆయన తండ్రి రామారావు బోథ్ నుంచి 1985,1989 లలో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచారు. ఆ తర్వాత 1994లో నగేశ్  టీడీపీ నుంచి బోథ్ ఎమ్మెల్యే గా మొదటిసారి గెలుపొందగా,  1999,2009 రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచారు. మొదటిసారి గెలిచిన సమయంలోనే ఆయన గిరిజన శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరిన ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందారు. 

మళ్లీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు చేతిలో ఓడిపోయారు.  2018లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గా గెలుపొందిన రాథోడ్ బాపురావుతో ఆయనకు మొదటి నుంచి వివాదాలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలో జరిగే అవినీతిపై ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా బహిరంగా విమర్శలు చేసేవారు. అధిష్టానం మెప్పుకోసం గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆయనకు చుక్కెదురైంది. బీఆర్ఎస్  నుంచి నేరడిగొండ జడ్పీటీసీ అనిల్ జాదవ్ కు టికెట్ కేటాయించడంతో నగేశ్​ నిరుత్సాహానికి గురయ్యారు. 

బీజేపీపై వైపు చూపు..

బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన నగేశ్​కు ఎంపీ సీటు సైతం ఇచ్చేందుకు అధిష్టానం నిరాకరిస్తున్నట్లు సమాచారం. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే గా ఉన్న ఆత్రం సక్కుకు ఈసారి బీఆర్ఎస్ టికెట్ ను కేటాయించలేదు. జడ్పీ చైర్ పర్సన్ గా ఉన్న కోవలక్ష్మీకి పార్టీ టికెట్ ఇవ్వడంతో ఆయన సందిగ్ధంలో పడ్డారు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం సక్కుకు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలో దించేందుకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలో ఇటు ఎంపీ సీటు కూడా ఆశించిన నగేశ్ ఇక తాను ఏదైనా పార్టీ నుంచి బరిలో ఉండేందుకే సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు అనుచరులు చెబుతున్నారు. ఆ పార్టీ బోథ్ అభ్యర్థిగా ప్రకటిస్తే బీఆర్ఎస్ ను వీడే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన బీజేపీ ముఖ్య నేతలను కలిశారని జిల్లాలో చర్చ జరుగుతోంది.