బిల్లులు రాక ఆగిన ఆదిలాబాద్ ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​

ఆదిలాబాద్, వెలుగు:బల్దియాలో ఏ అభివృద్ధి  చేపట్టినా   మధ్యలోనే ఆగిపోతోంది. సగం పనులు చేసి బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఆపేస్తున్నారు. పనులకు భూమి పూజలు చేసి  ప్రారంభించడమే తప్పా..   పూర్తి చేయడం లేదు. ఇప్పుడు ఆదిలాబాద్ సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు సైతం అర్ధంతరంగా ఆగిపోయాయి.  కలెక్టర్ సిక్తా పట్నాయక్, అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ భాషా ఈ నిర్మాణ పనులు పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించినా..ఆ దిశగా అడుగులు పడటం లేదు. పనులు కొనసాగించేందుకు  అధికారులు ఎలాంటి చొరవ  చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. 

రూ.7.20 కోట్లతో పనులు..

పట్టణంలోని సాత్నాల క్వార్టర్స్ సమీపంలో గతేడాది డిసెంబర్ లో ఇంటిగ్రేటెడ్​ మార్కెట్ నిర్మాణానికి ఎమ్మెల్యే జోగురామన్న  భూమి పూజ చేశారు. రూ. 7.2  కోట్లతో చేపట్టిన ఈ పనులు పిల్లర్ల దశలోనే ఆగిపోవడం గమనార్హం. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కూరగాయలు, చికెన్, మటన్, చేపలు, పండ్లు ఇలా మార్కెట్ మొత్తాన్ని ఒకేచోట నిర్మించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్​ మార్కెట్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. మాంసాహారం, శాఖాహారానికి సంబంధించి వేర్వేరు గదులు నిర్మించనున్నారు.  దాదాపు 3 ఎకరాల స్థలంలో చేపట్టిన ఈ పనులు  మొదట్లో హడావుడిగా చేశారు. అయితే 25 శాతం పనులు పూర్తియినా  ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు నిధులు రాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేసినట్లు తెలుస్తోంది.  

ప్రజలు అవస్థలు..

ప్రస్తుతం శివాజీ చౌక్ లోని పెద్ద మార్కెట్, వినాయక్ చౌక్ లో కూరగాయల మార్కెట్ ఉంది. నిత్యంవేల సంఖ్యలో వచ్చే ప్రజల కోసం రైతుబజార్, కూరగాయల మార్కెట్ సరిపోవడం  లేదు. ఇరుకుగా ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. రైతు బజార్ లో  పార్కింగ్ లేకపోవడంతో కూరగాయలకు వచ్చే వారు రోడ్డు పక్కన పార్కింగ్​ చేస్తే..  ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధించడం కామన్​అయిపోయింది.  వేర్వేరు చోట్ల ఉన్న మార్కెట్లను ఒకేదగ్గర  ఏర్పాటు చేసేందుకు ఇంటిగ్రేటెడ్​ మార్కెట్ నిర్మాణం   ప్రారంభించింది. నాన్ వెజ్, వెజ్ మార్కెట్ కోసం ప్రత్యేక గదులు నిర్మించడమే  కాకుండా.. పార్కింగ్ స్థలం కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో కోట్ల రూపాయలతో చేపట్టిన మార్కెట్ నిర్మాణం మధ్యలోనే ఆగింది. 

ప్రభుత్వానికి రిపోర్టు చేశాం

సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు బిల్లులు రాలేదని కాంట్రాక్టర్ ఆపేశాడు. రూ. 7.20 కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులు ఇప్పటి వరకు 25 శాతం జరిగాయి.  ఆ  పనులకు సంబంధించి నిధులు విడుదల చేయాలని ప్రభుత్వానికి రిపోర్టు పంపాం.  బిల్లులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. 
- అరుణ్,ఏ ఈ, మున్సిపల్