- ఆదిలాబాద్ జిల్లా వాగులో గల్లంతయిన పీజీ విద్యార్థి ప్రవీణ్
- కంఠ గ్రామం వద్ద గుర్తింపు
- తమ కొడుకు మృతిపై అనుమానాలున్నాయన్న తల్లిదండ్రులు
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదివారం వాగులో కొట్టుకుపోయిన ఆదిలాబాద్ రిమ్స్ పీజీ మెడికల్ స్టూడెంట్ భుక్యా ప్రవీణ్ రాథోడ్ డెడ్‌బాడీ సోమవారం దొరికింది. గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు ఆదివారం రాత్రి 10 గంటల వరకు గాలించినప్పటికీ దొరకపోవడంతో ప్రయత్నాన్ని విరమించుకున్నారు. మళ్లీ సోమవారం ఉదయం 8 గంటలకు గాలిస్తుండగా కంఠ గ్రామం వద్ద డెడ్‌బాడీ కనిపించింది. పోస్టుమార్టం కోసం రిమ్స్ దవాఖానకు తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా
వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామానికి చెందిన ప్రవీణ్ రిమ్స్ లో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
మృతి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఉస్మానాయక్ , లక్ష్మి రిమ్స్ కు చేరుకొని కొడుకు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ‘కొడుకా నువ్వు డాక్టర్ అవుతావని ఎన్నో ఆశలు పెట్టుకున్నామే...జీవచ్ఛవంలా కనిపిస్తావని అనుకోలే’ అంటూ విలపించారు. అయితే, తమ కొడుకు మృతిపై అనుమానాలున్నాయన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరేశ్ తెలిపారు.
డెడ్‌బాడీని గుర్తించినప్పుడు ప్రవీణ్ తలకు కర్చీఫ్ కట్టి ఉందని అనుమానాలు వ్యక్తం చేయగా దాని ప్రకారం దర్యాప్తు చేస్తామని చెప్పారు. ప్రవీణ్ డెడ్‌బాడీకి డీఎంహెచ్ఓ జనార్దన్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తో పాటు పలువురు డాక్టర్లు, మెడికల్ స్టూడెంట్లు నివాళులర్పించారు.