ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వల్ల బీఆర్ఎస్ పార్టీకి చెడ్డపేరు : జోగు రామన్న 

ఆదిలాబాద్ : బీసీలను కించపరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న హెచ్చరించారు. బీసీలను దూషించిన కౌశిక్ రెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ లో ఎమ్మెల్యే జోగు రామన్నను ముదిరాజ్ కుల సంఘం ప్రతినిధులు కలిశారు. ముదిరాజ్ కులాన్ని దూషించిన‌ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై  ప్రభుత్వం చర్యలు తీసుకునేలా చూడాలంటూ జోగు రామన్నకు వినతిపత్రం ఇచ్చారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను జోగురామన్న తీవ్రంగా ఖండించారు. ముదిరాజులను దూషించిన కౌశిక్ రెడ్డి యావత్తు బీసీలను అవమానించారని చెప్పారు. కౌశిక్ రెడ్డి తీరు వల్ల బీఆర్ఎస్ పార్టీకి చెడ్డపేరు వస్తుందన్నారు. ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ను కోరుతామన్నారు.