భైంసా, వెలుగు: మోసపూరిత హామీలతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోనూ అవే మాటలు చెబుతోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. ఆదివారం నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఎస్‌ఎస్ కాటన్ ఫ్యాక్టరీలో మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి రాగానే డిసెంబర్9న రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట మార్చి ఆగస్టులో అమలు చేస్తామని చెప్పడం రైతులను మోసగించడమేనన్నారు.
రైతులకు మే, జూన్ నెలల్లోనే పంట పెట్టుబడి అవసముంటుందని, అయితే ఆగస్టులో రుణమాఫీ చేస్తామని చెప్పడం వ్యవసాయంపై రేవంత్‌రెడ్డికి ఉన్న అవగాహనను అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ కు మనుగడ లేదని, జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడుతున్నారని అన్నారు. మోదీని మూడోసారి ప్రధాని చేయాలని ప్రజలే సంకల్పించుకున్నారని, ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించుకుని ప్రధానికి కానుకగా ఇస్తామన్నారు.
24న నామినేషన్ ర్యాలీ..
ఆదిలాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గోడం నగేశ్ ఈనెల 24న నామినేషన్ వేయనున్నారని పాయల్ శంకర్ తెలిపారు. ఉదయం 11 గంటలకు నామినేషన్ ర్యాలీ ప్రారంభమవుతుందని.. నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రామారావు పటేల్, జిల్లా అధ్యక్షుడు అంజుకుమార్‌రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్నగారి భూమయ్య, ఎంపీపీ అబ్దుల్ రజాక్, పట్టణాధ్యక్షుడు మల్లేశ్వర్, సావ్లి రమేశ్, తదితరులు పాల్గొన్నారు.